CanadaVisa: ఉన్నత చదువులు, ఉపాధి కోసం కెనడా వెళ్లాలని కలలు కంటున్న విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. పెరిగిపోతున్న వలసల ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాత్కాలిక వలసలపై కఠిన ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటా కేవలం 1.5 లక్షల మంది విదేశీ విద్యార్థులను మాత్రమే తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది. కెనడా ప్రభుత్వం విడుదల చేసిన ఈ కొత్త వీసా లెక్కలతో వేలాది మంది భారతీయ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
కొత్త వీసా లెక్కలివే.. ఉద్యోగులకూ పరిమితి!
రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2027 నుంచి 2029 వరకు ఏటా గరిష్టంగా 3.7 లక్షల మంది తాత్కాలిక వలసదారులకు మాత్రమే పర్మిషన్ లభించనుంది. ఇందులో 1.5 లక్షల కోటా విదేశీ విద్యార్థులకు కేటాయించగా, మిగిలిన 2.2 లక్షల వీసాలను తాత్కాలిక విదేశీ ఉద్యోగులకు పరిమితం చేశారు. 2026 ఏడాదికి గాను 1.55 లక్షల మంది విద్యార్థులకు అవకాశం కల్పించిన ప్రభుత్వం, వచ్చే రెండేళ్లలో ఆ సంఖ్యను మరింత కుదించడం గమనార్హం. అయితే, ఈ కొత్త రూల్స్ కేవలం కెనడాకు కొత్తగా రావాలనుకునే దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టతనిచ్చారు.
స్థానికుల ఆగ్రహం.. వసతి సంక్షోభమే అసలు కారణం
ఇటీవలి కాలంలో కెనడాలో తాత్కాలిక వలసదారుల జనాభా అంచనాలకు మించి పెరిగిపోయింది. దీంతో తమకు ఉండటానికి ఇళ్లు దొరకడం లేదని, వైద్యం వంటి కనీస ప్రజా సేవలపై తీవ్ర ఒత్తిడి పడుతోందని స్థానిక కెనడియన్ల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యా అవకాశాలు, శ్రామిక శక్తి అవసరాల మధ్య సమతుల్యత సాధించడంతో పాటు మౌలిక సదుపాయాలపై భారం తగ్గించుకోవడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐఆర్‌సీసీ పేర్కొంది. ఇదిలా ఉండగా, మరోవైపు ఆ దేశం ఏటా 2.44 లక్షల మందికి శాశ్వత నివాస హోదా కల్పిస్తుండటం విశేషం. మొత్తానికి, కెనడా రిలీజ్ చేసిన ఈ కొత్త వీసా లెక్కలతో రాబోయే రోజుల్లో విదేశీ విద్యార్థుల ఎంపిక ప్రక్రియ మరింత కఠినతరం కానుంది. ముఖ్యంగా భారత్ నుంచి అత్యధిక సంఖ్యలో కెనడా బాట పట్టే విద్యార్థులపై ఈ పరిమితులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.


