జాతీయం

Naxal Movement: 'మావోయిస్టు ముక్త భారత్' ఒట్టి మాటేనా? నిఘా వర్గాల రిపోర్టులో సంచలన నిజాలు!

9 నిమిషాల పఠనం

Naxal Movement: దేశంలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టేశామని కేంద్ర ప్రభుత్వం ఎంతో ధీమాగా ప్రకటించింది. వరుస ఎన్‌కౌంటర్లు, భారీ లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ నడ్డి విరిచేశామని, 'మావోయిస్టు ముక్త భారత్' లక్ష్యాన్ని చేరుకున్నామని సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత మార్చి నెలలో స్పష్టం చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఈ ప్రకటనలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

Naxal Movement: దేశంలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టేశామని కేంద్ర ప్రభుత్వం ఎంతో ధీమాగా ప్రకటించింది. వరుస ఎన్‌కౌంటర్లు, భారీ లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ నడ్డి విరిచేశామని, 'మావోయిస్టు ముక్త భారత్' లక్ష్యాన్ని చేరుకున్నామని సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత మార్చి నెలలో స్పష్టం చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఈ ప్రకటనలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. "మావోయిస్టుల అంతం" అనేది కేవలం కాగితాలకే పరిమితమైందా? నిషేధిత నక్సల్స్ మళ్లీ తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు భద్రతా దళాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

లొంగిపోయిన వారి అదృశ్యం.. మళ్లీ పురుడు పోసుకుంటున్న దళాలు!

'ఆపరేషన్ కగార్' తర్వాత 2024 నుంచి 2026 మార్చి వరకు దేశవ్యాప్తంగా 3,927 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇటీవల లొంగిపోయిన వారిలో కొందరు అదృశ్యం కావడం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కొత్త దళాలు మళ్లీ పురుడు పోసుకుంటుండటం నిఘా వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉండగా, ముఖ్యంగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో మావోయిస్టులు తిరిగి సంస్థాగతంగా బలపడేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

జార్ఖండ్ ఇంటెలిజెన్స్ సీక్రెట్ రిపోర్ట్.. నవంబర్‌లో మూడు వారోత్సవాలు!

మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం సేకరించిన జార్ఖండ్ ఇంటెలిజెన్స్ విభాగం, ఈ నెల 5వ తేదీన తెలంగాణ గ్రేహౌండ్స్, ప్రభుత్వానికి ఒక అత్యంత రహస్య నివేదికను పంపింది. తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు నవంబర్ నెలలో మూడు కీలక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ నివేదికలో వెల్లడైంది. నవంబర్ 8 నుంచి 15 వరకు 'ఖూన్ క్రాంతి సప్తాహ్' (రక్తపాత విప్లవ వారోత్సవాలు), నవంబర్ 16 నుంచి 22 వరకు 'దమన్ విరోధ్ సప్తాహ్' (అణచివేత వ్యతిరేక వారోత్సవాలు), నవంబర్ 24 నుంచి 30 వరకు 'షహీద్ సప్తాహ్' (అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు) నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాంచీ, జంషేడ్‌పూర్, ధన్‌బాద్ జిల్లా ఎస్పీల ప్రత్యక్ష పర్యవేక్షణలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు గుట్టుచప్పుడు కాకుండా రైళ్లలో ప్రయాణించడం, రైల్వే ట్రాక్‌లను పేల్చివేయడం లేదా రైళ్లపై దాడులకు తెగబడే ప్రమాదం ఉందన్న అనుమానంతో 'జార్ఖండ్ జాగ్వార్' కమాండో యూనిట్‌తో పాటు రైల్వే పోలీసులను కూడా హై-అలర్ట్‌లో ఉంచారు.

తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు..

పొరుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికలు పెరగడం తెలంగాణకు నేరుగా పెను సవాల్‌గా మారింది. మావోయిస్టు అగ్రనేతలు, కీలక క్యాడర్‌లో ఇప్పటికీ తెలంగాణకు చెందిన వారు ఉండటం, పైగా ఇటీవలి కాలంలో రాష్ట్రం నుంచి కొత్తగా రిక్రూట్‌మెంట్లు జరిగాయన్న అనుమానాలు పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో కూంబింగ్ తీవ్రతరం అయితే, మావోయిస్టులు తలదాచుకునేందుకు సరిహద్దులు దాటి తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.

దీంతో తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ తక్షణమే అప్రమత్తమయ్యారు. సరిహద్దు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఎస్పీలకు భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌ను సందర్శించిన డీజీపీ, గత రెండేళ్లలో 820 మంది మావోయిస్టులు లొంగిపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని అధికారులను హెచ్చరించారు. మావోయిస్టుల ఏరివేతను మరింత పటిష్టం చేసేందుకు గ్రేహౌండ్స్ ఆపరేషన్స్, ఆక్టోపస్ డీజీపీగా విక్రమ్ సింగ్ మాన్‌ను నియమించారు.

అడవుల నుంచి నగరాలకు.. సోషల్ మీడియాపై నిఘా!

ఒకప్పుడు కేవలం అటవీ, గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన నక్సల్స్, ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చి పట్టణ, నగర ప్రాంతాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, "మావోయిస్టులు తిరిగి వస్తున్నారు" అనే సంకేతాలిస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విప్లవ పాటలపైనా నిఘా విభాగం ప్రత్యేక దృష్టి సారించింది.

అభివృద్ధి మంత్రంతో చెక్ పెట్టే ప్రయత్నం

మరోవైపు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే రూ. 2 కోట్లతో మినీ స్టేడియాలు, అంబులెన్సులు, రోడ్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలతో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. 'సమాచారం మీది - బహుమతి మాది' కార్యక్రమం విజయవంతమైందని, నక్సలిజం లేని ప్రశాంత సమాజమే తమ లక్ష్యమని ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ స్పష్టం చేశారు.

మొత్తానికి, ఒకవైపు ప్రభుత్వం 'మావోయిస్టు ముక్త భారత్' అని ప్రకటిస్తుంటే, మరోవైపు సరిహద్దుల్లో మళ్లీ నక్సల్స్ కదలికలు కనిపించడం గమనార్హం. ఈ పరిణామాలను బట్టి చూస్తే మావోయిస్టుల సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదని స్పష్టమవుతోంది. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొత్త సవాల్‌ను ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.

#Naxal Movement#Maoist Movement#Maoist Free India#Maoists#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి