తెలంగాణ

సమరశంఖం పూరించిన సీపీఎస్ ఉద్యోగులు.. నవంబర్ 17న సామూహిక సెలవు

13 నిమిషాల పఠనం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) ఉద్యోగులు తమ చిరకాల ఆకాంక్ష అయిన పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ కోసం మరోసారి సమరశంఖం పూరించారు.

* కదం తొక్కనున్న సీపీఎస్ ఉద్యోగులు

* నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవు.. జిల్లా కేంద్రాల్లో దీక్షలు

* కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు మూడేళ్లు పూర్తవుతున్న వేళ ‘సామూహిక సెలవు’ సమరశంఖం

* బకాయిల చెల్లింపుల్లో వివక్ష, హెల్త్ కార్డులపై నిర్లక్ష్యం

* జేఏసీ నాయకత్వం తీరుపై భగ్గుమంటున్న క్యాడర్

CPS Employs: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) ఉద్యోగులు తమ చిరకాల ఆకాంక్ష అయిన పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ కోసం మరోసారి సమరశంఖం పూరించారు. రాష్ట్రంలోని మొత్తం 3.6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో మెజారిటీగా ఉన్న సుమారు 2.6 లక్షల నుంచి 2.80 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు గత 22 ఏళ్లుగా పెన్షన్ భద్రత లేక తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. సెప్టెంబర్ 1, 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్‌ను అమలులోకి తెచ్చిన నాటి నుంచి సామాజిక భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

సామూహిక సెలవు.. జిల్లా కేంద్రాల్లో దీక్షలు

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి మూడేళ్లు పూర్తవుతున్న నవంబర్ 17 (మంగళవారం) నాడు రాష్ట్రవ్యాప్తంగా 'సామూహిక సెలవు' పాటించి, 33 జిల్లా కేంద్రాల్లో శాంతియుత 'ధర్మ దీక్షలు / సత్యాగ్రహ దీక్షలు' నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ప్రకటించారు. క్షేత్రస్థాయి గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ మహానగర కమిషనరేట్ల వరకు ప్రతి ఒక్క ఉద్యోగి, ఉపాధ్యాయుడు సామూహిక సెలవుకు సిద్ధమై ప్రభుత్వానికి తమ గోడును వినిపించేందుకు కదులుతున్నారు.

ఎన్నికల హామీలు ఏమయ్యాయి? రిటైర్డ్ ఉద్యోగుల దయనీయ స్థితి!

2014 నుంచి ఓపీఎస్ సాధన కోసం సీపీఎస్ సంఘం నిరంతర ఉద్యమాలు సాగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సాగించిన పోరాటాల ఫలితంగా సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ కమ్ డెత్ గ్రాట్యుటీ, సర్వీసులో మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్ వంటి ప్రయోజనాలను సాధించుకోగలిగారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో సీపీఎస్ కింద పదవీ విరమణ పొందిన వారి సంఖ్య 5వేలు దాటింది. వీరికి నెలకు కేవలం రూ. 1,500 నుంచి రూ. 2,500 మాత్రమే పెన్షన్ వస్తుండటంతో వృద్ధాప్యంలో తీవ్ర ఆర్థిక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని రేవంత్ హామీ

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఎస్ ఉద్యమ తీవ్రతను చూసిన నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ సభలో సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఎన్నికల ప్రచారానికి వచ్చిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సైతం కామారెడ్డి, జడ్చర్ల సభల్లో మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో ఓపీఎస్ అమలు చేశామని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఓపీఎస్ పునరుద్ధరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. 2023 నవంబర్ 17న విడుదల చేసిన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీకి చోటు కల్పించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా హామీ అమలుకు నోచుకోకపోవడంతో ఉద్యోగుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది.

జనజాగరణ యాత్ర నుంచి ఎల్బీ స్టేడియం సభ వరకు.. సీఎస్‌కు వినతుల పరంపర

తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు TSCPSEU ఆధ్వర్యంలో జూలై 11 నుంచి ఆగస్టు 18 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో, 90 నియోజకవర్గల్లో 'జనజాగరణ యాత్ర' నిర్వహించి, 80 మందికి పైగా ఎమ్మెల్యేలను, ఏడుగురు కేబినెట్ మంత్రులను కలిసి రిటైర్డ్ ఉద్యోగుల దీనస్థితిని ఆధారాలతో సహా వివరించారు. అనంతరం ఆగస్టు 23న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలివచ్చి చారిత్రాత్మక 'జనజాగరణ సభ'ను విజయవంతం చేశారు. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూనే, ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తే మిమ్మల్ని మళ్లీ సీఎం చేసుకుంటామని ఉద్యోగులు బహిరంగంగా నినాదాలు చేశారు.

సామూహిక సెలవుకు వెళ్తున్నట్లు ముందస్తు నోటీసు

ఓపీఎస్ పునరుద్ధరణ వల్ల రాష్ట్ర ఖజానాపై తక్షణ భారం పడదని, పైగా ప్రైవేట్ పెన్షన్ ఫండ్ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తున్న మ్యాచింగ్ గ్రాంట్ నిలిచిపోయి వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలోనే ఆదా అవుతాయని సంఘం ఆర్థిక విశ్లేషణలతో సహా నివేదించింది. ఎల్బీ స్టేడియం సభ తీర్మానాలను సెప్టెంబర్ 16/17 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజుకు అందజేసినప్పటికీ, అధ్యయన కమిటీ వేస్తామన్న సీఎస్ హామీ ఇంతవరకు అమలు కాలేదు. రెండు నెలలు గడిచినా ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో, ఎల్బీ స్టేడియం తీర్మానం మేరకు నవంబర్ 13న సీఎస్‌కు మరోసారి రిమైండర్ వినతిపత్రం అందజేసి, నవంబర్ 17న సామూహిక సెలవుకు వెళ్తున్నట్లు ముందస్తు నోటీసు ఇచ్చారు.

బకాయిల చెల్లింపుల్లో వివక్ష.. హెల్త్ కార్డులకు దూరమైన రిటైర్డ్ ఉద్యోగులు

మరోవైపు, ఉద్యోగుల ఆర్థిక బకాయిల చెల్లింపుల్లోనూ సీపీఎస్ ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. గతంలో జేఏసీ నేతలు మహాధర్నాకు పిలుపునిచ్చి, సీఎస్‌తో జరిపిన చర్చల్లో ఉద్యోగుల బకాయిల విడుదలను నెలకు రూ. 1,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లకు పెంచుకున్నామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ, ఆ నిధుల్లో సీపీఎస్ ఉద్యోగుల డీఏ (DA) ఏరియర్స్ ఒక్క రూపాయి కూడా పడటం లేదు. కేవలం పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగుల జీపీఎఫ్ (GPF) ఖాతాల్లో మాత్రమే ఏరియర్లను సర్దుబాటు చేస్తూ, లక్షలాది మంది సీపీఎస్ ఉద్యోగుల నోట్లో మట్టికొడుతున్నారు.

ఆర్థిక భద్రత లేక, ఆరోగ్య బీమా అందక అవస్థలు

దీనికితోడు, పదవీ విరమణ పొందిన 5వేల మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులకు 'పెన్షనర్ ఐడీ' లేదన్న కారణంతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) హెల్త్ కార్డులను వర్తింపజేయడం లేదు. ఆర్థిక భద్రత లేక, ఆరోగ్య బీమా అందక రిటైర్డ్ ఉద్యోగులు వైద్యం కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అందుకే రాష్ట్ర స్థాయి ఈహెచ్ఎస్ కమిటీలో, ప్రభుత్వ అధ్యయన కమిటీలో సీపీఎస్ సంఘానికి అధికారిక ప్రాతినిధ్యం కల్పించాలని సీపీఎస్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

జేఏసీ సన్నాయి నొక్కులు.. నాయకత్వంపై వెల్లువెత్తుతున్న అనుమానాలు

రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న సీపీఎస్ ఉద్యోగుల సమస్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) అనుసరిస్తున్న వైఖరిపై ప్రతి జిల్లాలో క్యాడర్లు బాహాటంగానే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. 2వేల కోట్ల బకాయిల్లో సీపీఎస్ ఉద్యోగులకు వాటా లేకపోయినా, హెల్త్ కార్డుల అంశం వర్తించకపోయినా జేఏసీ నేతలు కనీసం ప్రశ్నించకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా నవంబర్ 17న సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన సామూహిక సెలవుకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించినా జేఏసీ అగ్రనాయకత్వం మాత్రం సంశయిస్తుండటం, నాడు ఆగస్ట్ 23న ఎల్బీ స్టేడియంలో జరిగిన సీపీఎస్ ఉద్యోగుల 'జన జాగరణ సభ'కు మద్దతు ఇవ్వకుండా, పాల్గొనలేదు.

JAC వైఖరిపై అనుమానాలు

JAC వైఖరి సీపీఎస్ ఉద్యోగులకు తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. జేఏసీలో భాగస్వాములుగా ఉన్న వివిధ సంఘాలు, సీపీఎస్ నాయకులు, పలు జిల్లాల నాయకులతో పాటు క్షేత్రస్థాయి క్యాడర్ మొత్తం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నా నాయకత్వం స్పందించడం లేదు. ఇటీవల జరిగిన జేఏసీ సమావేశంలో మెజారిటీ సీపీఎస్ నాయకులు, పలు సంఘాల నేతలు సామూహిక సెలవుకు మద్దతు ఇస్తామని స్పష్టం చేసినా, అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక ఆంతర్యమేమిటని ఉద్యోగులు నిలదీస్తున్నారు. సొంత సంఘాల అభీష్టాన్ని సైతం పక్కనపెట్టి వ్యక్తిగత స్వార్థం కోసం, కార్పొరేట్ సంస్థల ఫలాలకు ఆశపడ్డారా లేక ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారా? అన్న తీవ్ర సందేహాలు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్

ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి TSCPSEU నాయకత్వాన్ని ద్వైపాక్షిక చర్చలకు ఆహ్వానించాలని, ఓపీఎస్ పునరుద్ధరణకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగ లోకం డిమాండ్ చేస్తోంది. లేనిపక్షంలో, నవంబర్ 17న జరగనున్న సామూహిక సెలవు, 33 జిల్లా కేంద్రాల్లోని ధర్నా దీక్షల ద్వారా ప్రభుత్వానికి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంఘాల నాయకత్వానికి తమ ఐక్యత ఏంటో చూపిస్తామని 2.80 లక్షల సీపీఎస్ కుటుంబాలు స్పష్టం చేస్తున్నాయి.

#CPS Employs#CPS Employees#Contributory Pension Scheme#Telangana#Old Pension Scheme#OPS#Telangana Govt#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి