తెలంగాణ

Telangana Politics :పాలమూరు ప్రాజెక్టులో పొలిటికల్ వరద..

5 నిమిషాల పఠనం

elangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'పాలమూరు-రంగారెడ్డి' ఎత్తిపోతుల పథకం చుట్టే పొలిటికల్ హీట్ నడుస్తోంది. ప్రాజెక్టు కాలువల్లో సాగునీరు పారకముందే, అధికార కాంగ్రెస్ - ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు, సవాళ్ల వరద ఉధృతంగా పారుతోంది.

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'పాలమూరు-రంగారెడ్డి' ఎత్తిపోతుల పథకం చుట్టే పొలిటికల్ హీట్ నడుస్తోంది. ప్రాజెక్టు కాలువల్లో సాగునీరు పారకముందే, అధికార కాంగ్రెస్ - ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు, సవాళ్ల వరద ఉధృతంగా పారుతోంది. రాష్ట్ర స్థాయి మొదలు జిల్లా స్థాయి వరకు బహిరంగ సభలు, ప్రెస్ మీట్లు ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా ఇరు పార్టీల నేతలు ఈ ప్రాజెక్టునే రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు. "మేము 90 శాతం పనులు పూర్తి చేశాం.. మిగిలినవి మీరు ఎందుకు ఆపేశారు?" అంటూ గులాబీ నేతలు ప్రశ్నిస్తుంటే, "పైపై పనులు చేసి కమిషన్లు నొక్కేశారు.. అసలు కాలువల నిర్మాణం, భూసేకరణ ఏది?" అంటూ హస్తం నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

మోటార్ స్విచ్ ఆన్ చేశాం.. 90% అయిపోయిందన్న బీఆర్ఎస్!

2015 జూన్ 11న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని 1,200 గ్రామాలకు తాగునీరు, 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే భారీ లక్ష్యంతో రూ. 35 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకాన్ని చేపట్టారు. నిధుల కొరత, కేసులు, అనుమతుల జాప్యం నడుమే.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు (సెప్టెంబర్ 16న) కేసీఆర్ ఒక పంపును ఆన్ చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అప్పటికే 90 శాతం పనులు పూర్తి చేశామని, ఇప్పుడు మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేట్ చేస్తోందని బీఆర్ఎస్ నేతలు గట్టిగా వాదిస్తున్నారు.

ఆ 90% లెక్కల గుట్టు విప్పుతున్న కాంగ్రెస్..

అయితే, రాష్ట్రంలో అధికారం మారినప్పటి నుంచి ఈ 90 శాతం లెక్కలపై కాంగ్రెస్ సర్కార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కేవలం కమిషన్లు దండుకునే రిజర్వాయర్లు, పంప్ హౌస్‌ల పనులను మాత్రమే చేసి, క్లిష్టమైన భూసేకరణ, ప్రధాన కాలువల నిర్మాణాన్ని గాలికి వదిలేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నార్లాపూర్ వద్ద రెండు పంపులు ఏర్పాటు చేసి పనులు అయిపోయాయని చెప్పుకుంటున్నారని, కానీ ఉదండాపూర్, లక్ష్మీదేవపల్లి, కరివెన రిజర్వాయర్ల భూసేకరణ, కాలువల సంగతి ఏంటని అధికార పార్టీ నేతలు నిలదీస్తున్నారు. జరిగిన పనులేంటి, జరగాల్సింది ఎంత అనే లెక్కలు తీసి మరీ కాగితాలు చేతబట్టి గులాబీ నేతలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. 90 శాతం పనులు పూర్తయ్యాయంటున్న వారు క్షేత్రస్థాయికి వచ్చి ఏం చేశారో చూపించాలని సవాళ్లు విసురుతున్నారు.

ఎల్‌నినో నీటి కష్టాలు.. రైతుల ఆవేదన ఇదే!

గత మూడేళ్లుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలు పూర్తిగా ఈ ఎత్తిపోతుల పథకం చుట్టూనే తిరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతలు 'ఢీ అంటే ఢీ' అన్నట్లుగా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో నీటి కష్టాలు మొదలవుతున్న వేళ, ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఈ ప్రాజెక్టు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే నాయకుల పొలిటికల్ డ్రామాపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. "మీ రాజకీయాల సంగతి పక్కన పెట్టి, మా పొలాలకు పూర్తిస్థాయిలో నీళ్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి" అంటూ అన్నదాతలు ప్రభుత్వాన్ని, నాయకులను ప్రశ్నిస్తున్నారు.

#Telangana Politics#Palamuru Rangareddy Project#Palamuru Project#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి