భారత క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ వేదికలపై దేశ కీర్తి పతాకను ఎగురవేసిన క్రీడాకారులు, అత్యుత్తమ శిక్షణ అందించిన గురువులకు కేంద్ర ప్రభుత్వం అందించే 'జాతీయ క్రీడా పురస్కారాలు-2025' ప్రదానోత్సవం శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో డెకాథ్లాన్ స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్, ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ విజేత దివ్య దేశ్‌ముఖ్‌తో పాటు మొత్తం 15మంది క్రీడారత్నాలు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులను స్వీకరించారు.
సాధారణంగా ప్రతి ఏటా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆగస్టు 29న ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది. అయితే ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరాల్లో ఎంపిక ప్రక్రియ కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తుంటారు. ఈ క్రమంలోనే ఏడాదికి పైగా ఆలస్యంగా 2025 సంవత్సరపు జాతీయ క్రీడా పురస్కారాలను ఇప్పుడు ప్రదానం చేశారు.
కామన్వెల్త్ గేమ్స్ డెకాథ్లాన్ విభాగంలో కాంస్య పతకం సాధించి, ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించగా.. ఫిడే మహిళల ప్రపంచ కప్-2025 ఫైనల్‌లో దిగ్గజ క్రీడాకారిణి కోనేరు హంపిపై విజయం సాధించి టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా దివ్య దేశ్‌ముఖ్ అరుదైన రికార్డు నెలకొల్పారు. వీరితో పాటు అథ్లెట్ మహమ్మద్ అజ్మల్, బాక్సర్ నరేందర్, చెస్ ప్లేయర్ విదిత్ గుజరాతి, హాకీ క్రీడాకారులు లాల్రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్ సహా పలువురు క్రీడాకారులు అర్జున పురస్కారాన్ని స్వీకరించారు.
కాగా జపాన్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొంటున్న కారణంగా మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు యెషయా అరుమైనియాగం 'అర్జున అవార్డు' పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కోచ్‌లకు అందించే 'ద్రోణాచార్య అవార్డు'ను అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్‌లు ఛోటే లాల్ యాదవ్, ధర్మేంద్ర సింగ్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్, రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర కుమార్‌లకు రాష్ట్రపతి ప్రదానం చేశారు.
సాహస క్రీడల్లో విశేష ప్రతిభ చూపిన విజేతలకు టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలను అందజేశారు. దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించడంలో విశేష కృషి చేసిన పుణెలోని ఆర్మీ పారాలింపిక్ నోడ్‌కు 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్' లభించగా, లెఫ్టినెంట్ కల్నల్ దల్జీత్ సింగ్ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఆగస్టు 18న అవార్డు గ్రహీతల తుది జాబితాను ప్రకటించింది.


