హైదరాబాద్ నగర మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ నేపథ్యంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆయన చేసి పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక విశ్రాంత ఐపీఎస్.. ప్రస్తుతం విధుల్లోనే ఉన్న మరో ఐపీఎస్ మీద నేరపూరిత ఆరోపణలు చేయడం పోలీసు వర్గాల్లోనే హాట్ టాపిక్ అయ్యింది.
తెలంగాణ ప్రభుత్వం గురువారం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను ఫైర్ సర్వీసెస్, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీపీగా బదిలీ చేసి, ఆయన స్థానంలో మహేశ్ భగవత్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
దీనిపై విశ్రాంత ఐపీఎస్ నాగేశ్వర్ రావు స్పందిస్తూ.. 'యూనిఫాంలో ఉన్న నేరస్థుడు' సజ్జనార్ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సీపీ పోస్టు నుంచి ఆయనను బదిలీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో తనతో కలిసి పనిచేసిన ఒక సహోద్యోగిని ఇలా విమర్శించడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని, అయినప్పటికీ సర్వీస్ స్నేహబంధం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకే నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సి వచ్చిందని వివరించారు.
కేవలం సజ్జనార్‌ను బదిలీ చేయడం వల్ల అది శిక్ష కాబోదని, గతంలో జరిగిన నేరాలు చెరిగిపోవని ఆయన వ్యాఖ్యానించారు. సజ్జనార్ పాల్పడినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించి, చట్టం ముందు నిలబెట్టాలని నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టడం ద్వారానే వ్యవస్థను ప్రక్షాళన చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నాగేశ్వర రావు ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇదిలాఉండగా, గతంలో సజ్జనార్ పలు ఎన్ కౌంటర్‌లను ఉద్దేశ పూర్వకంగా చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా నగర సీపీగా ఉంటూ పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఆయన్ను తాజాగా అప్రాధాన్య పోస్టుకు తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వీసీ సజ్జనార్‌కు వీడ్కోలు..
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న వీసీ సజ్జనార్‌కు పోలీసులు ఘన వీడ్కోలు పలికారు.ఆయనకు మెడలో పూల మాల వేసి ఓపెన్ టాప్ జీపులో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తోటి పోలీసు సిబ్బంది చూపించిన అనురాగానికి వీసీ సజ్జనార్ భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది.


