పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సాయంగా గత ప్రభుత్వం అందజేసిన కళ్యాణలక్ష్మి చెక్కులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం లేదని తెలుస్తోంది. దీంతో కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్లుగా ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడిపిల్ల పెళ్లయిన నెల రోజులలోపు కళ్యాణలక్ష్మి సాయం అందించేవారు.అది ఆడపిల్ల తండ్రికి భరోసాగా నిలిచేది. ప్రస్తుతం నెలల తరబడి ఎదురుచూసినా చెక్కులు ఇవ్వడం లేదు. ఇదేంటని అడిగితే నిధులు లేవని, అందుకే ఆలస్యం అవుతోందని స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు చెబుతున్నారు.
పాప పుట్టాక మోక్షం..
వాస్తవానికి పెళ్లయిన తర్వాత అందాల్సిన కళ్యాణలక్ష్మి చెక్కును ఓ మహిళ తనకు పాప పుట్టాక అందుకున్నది. జగిత్యాలలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పెళ్లయి పాప పుట్టిన మహిళకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ చెక్కు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, తులం బంగారం ఎలాగూ ఇవ్వడం లేదని, కనీసం ఇచ్చే చెక్కు అయినా సమయానికి ఇవ్వండి అంటూ మహిళలు మండిపడుతున్నారు. ఈ విషయం తెలిసిన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన కళ్యాణలక్ష్మి చెక్కులను పిల్లలు పుట్టాక ఇస్తున్నారని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ఘనత అని సెటైర్లు వేస్తున్నారు.
చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం
తెలంగాణలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు నీరుగారుతున్నట్టు తెలుస్తోంది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యమే ఇందుకు కారణంగా తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టినప్పటికీ కొన్నింటికీ నిధుల కొరత వేధిస్తున్నట్టు సమాచారం. పెళ్లయిన వెంటనే అందాల్సిన ఆర్థిక సాయం.. నెలలు, సంవత్సరాలు అయినా రావడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పథకం ఉద్దేశం, సాయం..
పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఖర్చులకు భరోసా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద రూ.1,00,116 (దివ్యాంగులకు ₹1,25,145) ఆర్థిక సాయం అందిస్తోంది. 2014లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 16.78 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. అయితే, దరఖాస్తు చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన, నిధుల కేటాయింపులో ఆలస్యం కారణంగా వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల పెళ్లి సమయానికి సాయం అందక, తల్లిదండ్రులు అప్పులు చేసి పెళ్లిళ్లు చేయాల్సి వస్తోంది.


