రూ.5లక్షల భారీ సబ్సిడీతో సొంతింటి కల సాకారం
తొలి విడతలో 5 నగరాలు.. 2,400 ఫ్లాట్ల నిర్మాణం
నాలుగు సులభ వాయిదాలలో చెల్లింపు వెసులుబాటు
పారదర్శక లాటరీ ఎంపిక.. డిసెంబర్ 5వరకు గడువు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణ ప్రాంత అల్పాదాయ వర్గాల (LIG) సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) వెలుపల ఉన్న ఐదు ప్రధాన నగరపాలక సంస్థల పరిధిలో 'ఇందిరమ్మ ఇళ్ల టవర్స్' పథకం కింద మొదటి విడతలో 2,400 ఫ్లాట్ల నిర్మాణానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక డిమాండ్ సర్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ బృహత్తర పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల భారీ సబ్సిడీని అందించడంతో పాటు స్థలాన్ని ఉచితంగా సమకూరుస్తోంది. దీంతో లబ్ధిదారుడి వాటాగా కేవలం రూ.3.50లక్షలు మాత్రమే చెల్లిస్తే సొంత ఫ్లాట్ సొంతమయ్యే సువర్ణావకాశం లభించింది.
తొలి దశలో భాగంగా నిజామాబాద్ (నాగారం - ఆర్‌జీకే కాలనీ), గ్రేటర్ వరంగల్ (గీసుకొండ మండలం గొర్రెకుంట), హనుమకొండ (కాజీపేట మండలం మడికొండ), నల్గొండ (మామిళ్లగూడ - డీవీకే రోడ్డు), మహబూబ్‌నగర్ (బండమీదిపల్లి) ప్రాంతాల్లో ఒక్కో చోట 480 చొప్పున మొత్తం 2,400 ఫ్లాట్లను నిర్మించనున్నారు. జీ+5 (G+5) లేదా అంతకంటే ఎక్కువ అంతస్తుల్లో అధునాతన వసతులతో నిర్మించే ప్రతి ఫ్లాట్ రిజిస్ట్రబుల్ విస్తీర్ణం 512 చదరపు అడుగులుగా ఉంటుందని హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది.
మొదటి విడత పూర్తయిన తర్వాత కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల వంటి ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఇదే తరహా టవర్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అర్హత నిబంధనల విషయానికొస్తే.. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.6లక్షలకు మించకూడదు, సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా సొంతిల్లు లేదా నివాస స్థలం లేని స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారులపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా తమ వాటా అయిన రూ.3.50 లక్షలను నాలుగు సులభ వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించారు.
తాత్కాలిక కేటాయింపు సమయంలో రూ.లక్ష, ఆర్సీసీ నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష, ఫినిషింగ్ దశలో రూ.లక్ష, ఫ్లాట్ అప్పగించే సమయంలో మిగిలిన రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన వారికి బ్యాంక్ రుణాలు పొందే సౌకర్యం కూడా ఉండగా, కేటాయింపు జరిగిన తర్వాత 10ఏళ్ల వరకు ఫ్లాట్‌ను విక్రయించడం గానీ, అద్దెకు ఇవ్వడం గానీ నిషేధించారు. ఆసక్తి గల అర్హులు రూ.100 నాన్-రిఫండబుల్ దరఖాస్తు రుసుముతో పాటు రూ.10,000 టోకెన్ అడ్వాన్స్ (EMD) డిపాజిట్ చెల్లించి సమీపంలోని మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
లాటరీలో ఫ్లాట్ రాని దరఖాస్తుదారులకు ఈ రూ.10వేల డిపాజిట్ మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. 360డిగ్రీల విచారణ, పారదర్శక లాటరీ (లక్కీ డ్రా), క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తుది కేటాయింపులు చేపడతారు. దరఖాస్తుల సమర్పణకు డిసెంబర్ 5, 2026 చివరి తేదీ కాగా, పూర్తి వివరాల కోసం హౌసింగ్ బోర్డు హెల్ప్‌లైన్ నంబర్ 040-24603572 లేదా అధికారిక వెబ్‌సైట్ tghb.telangana.gov.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.


