హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్ సమ్మిట్ -2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేటి సాయంత్రం నగరానికి రానున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనున్నారు. ఇప్పటికే ప్రియాంకగాంధీ నగరానికి చేరుకున్నారు. నేడు ఆమె భారత్ సమ్మిట్లో కీలక ప్రసంగం చేయనున్నారు. కార్యక్రమం చివరి రోజు అనగా రేపు రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఆయనతో పాటే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం మాట్లాడనున్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నేతలు హైదరాబాద్కు క్యూ కడుతున్నారు. ఇదిలాఉండగా, రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారని తెలియడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాహుల్ గాంధీ పర్యటనపై ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావ్ రాహుల్ గాంధీ?’ అంటూ ప్రశ్నించారు.
‘ఉద్యోగాల కోసం పోరాడిన విద్యార్థులపై లాఠీచార్జి జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు? లగచర్ల గిరిజన మహిళలపై దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? హైడ్రా కూల్చివేతలతో పేదల ఇళ్లు కూలినప్పుడు మీ స్పందన ఏది? కంచ గచ్చిబౌలిలో వేలాది చెట్ల నరికివేతపై ఎందుకు మౌనంగా ఉన్నారు?
రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై ఎందుకు స్పందించలేదు? జర్నలిస్టుల అరెస్టులు, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఎందుకు నోరు మెదపలేదు? ప్రజా సమస్యలపై ప్రశ్నించని రాహుల్.. ఇప్పుడు రూ.100 కోట్ల ప్రజాధనంతో సభలు, ప్రచార ఆర్భాటాలకా వస్తున్నది? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలి’ అని కేటీఆర్ నిలదీశారు. ఇదిలాఉండగా,ప్రజాధనంతో కాంగ్రెస్ పార్టీ తరఫున భారత్ సమ్మిట్ నిర్వహించడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి నిన్న ప్రశ్నించారు. కాగా,రాహుల్ రాకను నల్ల జెండాలు ప్రదర్శించి అడ్డుకుంటామని ఇప్పటికే బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సైతం స్పష్టంచేశారు.


