కూకట్పల్లి ట్రక్ పార్కుల భూములు వేలం వేయాలన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు రేవంత్ రెడ్డి భూముల చుట్టే తిరుగుతున్నాడని, సీఎం కుర్చీలో కూర్చుని రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడని ఆరోపించారు. నాడు బొందల గడ్డకు జాగా ఉండదని డైలాగులు కొట్టిన ముఖ్యమంత్రి.. నేడు కైతలాపూర్‌లో బొందల గడ్డను కూడా చదును చేస్తున్నారని మండిపడ్డారు.
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
కూకట్పల్లి మూసాపేట ట్రక్ పార్క్ భూముల్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఆర్టీఓ ఆఫీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నర్సరీని కూడా అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ‘బిడ్డా జాగ్రత్త.. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వేలంలో ఎవరు భూములు కొన్నా అనుమతులు ఇవ్వం. మళ్లీ వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకే వాడుతాం’ అని హరీశ్ రావు హెచ్చరించారు.
1982 హుడా చట్టం ప్రకారం ఇక్కడ ఇండ్లు కట్టొద్దని, వ్యాపారం చేయొద్దని రైతుల నుంచి భూములు తీసుకున్నారని గుర్తుచేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లను తుంగలో తొక్కితే HMDA అధికారులకు శిక్ష తప్పదని హరీశ్ రావు హెచ్చరించారు.రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల భూములు అమ్మకానికి పెట్టారని, ఇప్పటికే రూ. 26 వేల కోట్ల భూములను అమ్ముకున్నారని ఆరోపించారు. ముంబై బ్రోకర్‌కు రూ.500 కోట్ల లంచం ఇచ్చి HCU, HMDA భూములను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదువబెట్టి రూ. 20 వేల కోట్ల అప్పు తెచ్చారని మాజీ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు.
ఇండస్ట్రియల్ భూముల అమ్మకం..
హిల్ట్ పాలసీ పేరుతో బాలానగర్, జీడిమెట్ల, అజామాబాద్‌లో 9,900 ఎకరాల ఇండస్ట్రియల్ భూములను కమీషన్ల కోసం అడ్డికి పావుసేరుకు కట్టబెడుతున్నారన్నారు. ప్రజల జీవితాలను విధ్వంసం చేయడానికి తుఫాను, సునామీ, భూకంపాలు అక్కర్లేదని, రేవంత్ రెడ్డి పాలన చాలన్నారు. ఎల్‌నినో కరువు కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరం అని విమర్శించారు. అనంతరం అక్కడ సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొని మీడియాతో మాట్లాడారు.
అంతకుముందు కూకట్పల్లి ట్రక్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన హరీశ్ రావు స్థానిక ప్రజలు, లారీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రక్ పార్క్ భూముల వేలాన్ని కచ్చితంగా అడ్డుకుంటామని, స్థానిక ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ రావు, సీపీఐ, సీపీఎం నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.


