స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

లంచావతారులకు మళ్లీ కీలక పోస్టింగులా?

8 నిమిషాల పఠనం

ప్రజలకు రక్షణ కల్పించి, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ శాఖలోనే కొందరు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కినా ప్రభుత్వం ఇంకా వారిలో పట్టం కడుతూ పదోన్నతులు కల్పిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయిగత మూడేళ్లుగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పోలీస్ అధికారులపై పెద్ద ఎత్తున ఏసీబీ కేసులు నమోదయ్యాయి.

  • ఏసీబీకి పట్టుబడిన పోలీస్ అధికారులకూ పదోన్నతులు?

  • బంజారాహిల్స్ నుంచి సీసీఎస్ వరకు.. వెలుగులోకి వస్తున్న లంచాల బాగోతాలు

  • గత మూడేళ్లలో వరుస ఏసీబీ కేసులు

  • సస్పెన్షన్ ఎత్తివేత తర్వాత మళ్లీ 'ఫోకల్' పోస్టులు?

  • విచారణ దశలో కీలక బాధ్యతలను ఎలా అప్పగిస్తారు?

  • పోస్టింగులపై సమీక్ష ఏది?

  • సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీలు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్లు

ప్రజలకు రక్షణ కల్పించి, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ శాఖలోనే కొందరు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కినా ప్రభుత్వం ఇంకా వారిలో పట్టం కడుతూ పదోన్నతులు కల్పిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదవడం వంటి ఘటనలు పోలీస్ శాఖ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. గత మూడేళ్లుగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పోలీస్ అధికారులపై పెద్ద ఎత్తున ఏసీబీ కేసులు నమోదయ్యాయి.

అయితే ఈ కేసుల అనంతరం సంబంధిత అధికారులపై తీసుకున్న శాఖాపరమైన చర్యలేమిటి? వారు ప్రస్తుతం ఏ స్థానాల్లో పనిచేస్తున్నారు? తిరిగి కీలకమైన ఫోకల్ పోస్టుల్లోనే బాధ్యతలు అప్పగించారా? అనే ప్రశ్నలు ఇప్పుడు అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2023లో తెలంగాణ ఏసీబీ మొత్తం 99 మందిని అరెస్టు చేయగా, వారిలో పోలీసు శాఖకు చెందినవారు కూడా ఉన్నారు.

2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలంగాణలో మొత్తం 31 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఏసీబీకి చిక్కారు. వీరిలో మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ ఎస్‌ఐ డి.సురేష్ రూ.20 వేలు, ఏప్రిల్‌లో మాదాపూర్ ఎస్‌ఐ రంజిత్, కానిస్టేబుల్ విక్రమ్ రూ.20వేల లంచం కేసులో పట్టుబడ్డారు. మే 31న కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసును మూసివేసేందుకు రూ.3 లక్షల లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో సీఐ జి.వీరస్వామి, ఎస్‌ఐ షేక్ షఫీని ఏసీబీ అరెస్టు చేసింది. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో ఏసీపీ టి.ఎస్. ఉమా మహేశ్వరరావుపై రూ.3.95 కోట్ల అక్రమాస్తుల కేసు, 2024 జూన్ 13న సీసీఎస్ ఈవోడబ్ల్యూ (EOW) ఇన్‌స్పెక్టర్ చామకూరి సుధాకర్ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటనలు సంచలనం సృష్టించాయి.

గతేడాది (2025)లోనూ 2025 పూర్తి ఏడాది ఏసీబీ మొత్తం 199 కేసులు నమోదు చేసింది. అందులో జనవరి–మే వరకు 17 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఏసీబీకి పట్టుబడ్డారు. వీరిలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎస్‌ఐ వి. సురేష్, కానిస్టేబుల్ నాగరాజు రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసును పరిష్కరించేందుకు రూ.3 లక్షలు డిమాండ్ చేసి, రూ.1.40 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. శామీర్‌పేట ఎస్‌ఐ ఎం. పరశురామ్ గతంలో రూ.2 లక్షలు తీసుకున్నట్లు, మరో రూ.22 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు ఆరోపణలు నమోదయ్యాయి. మణుగూరు సీఐ సోమ సతీష్ కుమార్ కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.4 లక్షలు డిమాండ్ చేయగా, మధ్యవర్తిగా ఉన్న మీడియా ప్రతినిధి మిట్టపల్లి గోపి రూ.లక్ష స్వీకరిస్తుండగా ఏసీబీకి చిక్కారు.

ఈ ఏడాది(2026) చందానగర్ ఎస్‌ఐ బండెల బాలరాజ్, కానిస్టేబుల్ బి.రాఘవేంద్ర కుమార్ రూ.75 వేల లంచం కేసులో, టోలిచౌకి ఎస్‌ఐ ఆర్.పండు నాయక్ రూ.10వేల లంచం కేసులో, కీసర ఎస్‌ఐ ద్యాప గ్నానేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ అర్కపల్లి అంజనేయులు రూ.5 క్షల లంచం వ్యవహారంలో ఏసీబీ చర్యలు ఎదుర్కొన్నారు. అక్టోబర్ 27న మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్ ఎం కొండల్ రావు, హోంగార్డు అబిద్ అలీ రూ.3లక్షలు స్వీకరించిన కేసులో పట్టుబడ్డారు. తాజాగా నవంబర్ 9న కీసర ఎస్‌ఐ కొండారెడ్డి శ్రీనివాస్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

ఈ కేసుల్లో అరెస్టులు, ప్రాథమిక విచారణలు జరిగినప్పటికీ.. ఆ తర్వాత సదరు అధికారుల శాఖాపరమైన స్థితిగతులపై పారదర్శకత లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సస్పెన్షన్ ఎత్తివేసిన అనంతరం వారిని తిరిగి నివాస ప్రాంతాలకు దగ్గరగా, ఒకే ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు, లేదా విస్తృత అధికారాలు ఉండే క్రైమ్ ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ వంటి ఫోకల్ పోస్టుల్లో నియమిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

కేసుల విచారణ కొనసాగుతున్న దశలో కీలక పోస్టులు కట్టబెడితే దర్యాప్తుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోలీస్ వ్యవస్థపై సామాన్య ప్రజల్లో విశ్వాసం చెక్కుచెదరకుండా ఉండాలంటే కేవలం ఏసీబీ దాడులు, అరెస్టులతో సరిపెట్టకుండా పోస్టింగుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. గత మూడేళ్లలో ఏసీబీ కేసులు ఎదుర్కొన్న పోలీస్ అధికారుల ప్రస్తుత హోదా, కేసుల స్థితి, పోస్టింగుల వివరాలపై సమగ్ర సమీక్ష జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నాన్-ఫోకల్ పోస్టింగులు మాత్రమే కేటాయించేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

#TelanganaColdWaveAlert2026#TemperatureDropTelanganaIMD#TelanganaHealthDepartmentAdvisory#WinterHealthTipsTelugu#HyderabadWeatherUpdate2026#TelanganaNewsTelugu#HydNewsTelugu#HealthNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి