TG: తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన సమగ్ర భూ రీసర్వే ప్రక్రియపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు పెంచింది. ఉన్నతాధికారులు కేవలం సచివాలయం, కలెక్టరేట్లలోని ఏసీ గదులకే పరిమితం కాకుండా నేరుగా రైతుల వద్దకు క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాష్ట్రంలో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, స్వయంగా గ్రామాల్లో పర్యటించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కఠిన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో రీసర్వే, హౌసింగ్ అంశాలపై మంత్రి సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆఫీసుల్లో కూర్చుంటే కుదరదు..
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే భూ సమస్యల మూలాలు తెలుస్తాయని, సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో రైతులతో నేరుగా మాట్లాడి, రీసర్వేపై వారిలో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని తేల్చిచెప్పారు. రెవెన్యూ రికార్డుల్లో నమోదైన భూమి విస్తీర్ణం ఎంత? రీసర్వే అనంతరం గుర్తించిన వాస్తవ విస్తీర్ణం ఎంత? అనే వివరాలను భూ యజమానులకు తక్షణమే రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. సర్వే పూర్తయి నోటీసులు జారీ చేసిన తర్వాత, రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామాల్లో తప్పనిసరిగా దండోరా (చాటింపు) వేయించాలి.
రెవెన్యూ, ఫారెస్ట్ భూముల సరిహద్దుల వివాదాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి, అటవీ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోనే సరిహద్దులను నిర్ధారించాలని ఆదేశించారు.
పాలేరులో పైలట్ ప్రాజెక్ట్.. త్వరలో మరో 400 రోవర్లు
పాలేరు నియోజకవర్గంలోని మొత్తం 141 రెవెన్యూ గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి రెండు బృందాలు, రెండు రోవర్లు చొప్పున మొత్తం 708 రోవర్లతో సర్వే కొనసాగుతోందని.. సర్వే వేగాన్ని పెంచేందుకు మరో వారం రోజుల్లో అదనంగా 400 రోవర్లను క్షేత్రస్థాయికి పంపుతామని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారుల అనుభవాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎస్ఓపీలో మార్పులు చేసి మరింత స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తామన్నారు.
నిజామాబాద్‌పై మంత్రి అసంతృప్తి..
రీసర్వే నిర్వహణలో ముందంజలో ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను మంత్రి అభినందించగా, నిజామాబాద్ జిల్లా పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. అలాగే, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 22ఎ భూముల సమస్యలను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వేగంగా కొలిక్కి తేవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.


