తెలంగాణ

Telangana Congress: కాంగ్రెస్‌లో 'మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు'! అధిష్టానం మౌనం వెనుక మతలబేంటి?

6 నిమిషాల పఠనం

Telangana Congress: తెలంగాణలో అధికారంలో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ప్రతిపక్షాల కంటే సొంత నేతల అంతర్గత కుమ్ములాటలే పెను సవాలుగా మారుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో పరిస్థితి 'మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు' అన్న చందంగా తయారైంది.

Telangana Congress: తెలంగాణలో అధికారంలో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ప్రతిపక్షాల కంటే సొంత నేతల అంతర్గత కుమ్ములాటలే పెను సవాలుగా మారుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో పరిస్థితి 'మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు' అన్న చందంగా తయారైంది. నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరి, కేసులు, అరెస్టుల దాకా వెళ్తున్నా టీపీసీసీ అధిష్టానం మాత్రం కనీసం స్పందించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో మౌనం వహించడం వెనుక ఉన్న మతలబేంటి? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

'మిగిలిన వారే లీడర్లు' అన్న ధోరణిలో పెద్దలు?

జిల్లాలో వర్గపోరు తీవ్రమై పార్టీ పరువు బజారున పడుతున్నా, సయోధ్య కుదిర్చేందుకు టీపీసీసీ పెద్దలు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంపై క్షేత్రస్థాయి క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. "నేతలు ఏమైనా చేసుకోండి, ఎలా అయినా తన్నుకోండి.. చివరికి మిగిలిన వారే లీడర్లు" అన్నట్లుగా రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తోందనే కామెంట్స్ స్థానిక నేతల నుంచే వినిపిస్తున్నాయి. పదవుల పంపకంలో ఇబ్బందులు వస్తాయనా? లేక కీలక నేతలు, మంత్రుల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో తలదూర్చడం ఇష్టం లేకనా? అన్నది తెలియదు కానీ, అధిష్టానం మౌనం మాత్రం పార్టీ పునాదులను బలహీనపరుస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బలహీనంగా ఉన్న ఆరు స్థానాల్లోనూ కుమ్ములాటలే!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ప్రస్తుతం కాంగ్రెస్‌కు కేవలం నలుగురు ఎమ్మెల్యేలు (మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్) మాత్రమే ఉన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు పరిధిలో అయితే ఒక్క ఖానాపూర్ మినహా మిగతా ఆరు స్థానాల్లో (ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఆసిఫాబాద్, సిర్పూర్) హస్తం పార్టీ ఓటమి పాలైంది. వాస్తవానికి ఈ ఆరు నియోజకవర్గాల్లో నేతలంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది. కానీ, ఇక్కడ నేతలు వర్గాలుగా విడిపోయి ఒకరి గోతులు మరొకరు తవ్వుకుంటుండటంతో ఇప్పటికీ ప్రతిపక్షాలదే పైచేయిగా కనిపిస్తోంది.

మంచిర్యాలలో ముదిరిన పోరు..

ఎమ్మెల్యేలు లేని చోటే కాకుండా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లోనూ పరిస్థితి అదుపుతప్పుతోంది. ముఖ్యంగా మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు వ్యతిరేకంగా పార్టీ నేత జగన్మోహన్ రావు వర్గం కార్యకలాపాలు నిర్వహిస్తుండటం సంచలనంగా మారింది. జగన్మోహన్ రావుకు మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మద్దతు ఇస్తున్నారనేది స్థానికంగా బహిరంగ రహస్యం. ఈ ఇరువర్గాల మధ్య ఘర్షణలు శాంతిభద్రతల సమస్యకు దారితీసి, పరస్పర కేసులు, అరెస్టుల వరకు వెళ్లినా అధిష్టానం చోద్యం చూడటంపై క్యాడర్ గగ్గోలు పెడుతోంది.

అటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు వ్యతిరేకంగానూ సొంత పార్టీలోనే వర్గాలు బలపడుతుండగా, ఖానాపూర్ (వెడ్మ బొజ్జు), చెన్నూరు (మంత్రి వివేక్ వెంకటస్వామి) నియోజకవర్గాల్లోనూ క్యాడర్‌లో అంతర్గత అసంతృప్తి రగులుతోంది. మొత్తానికి, సమిష్టి పోరాటం కంటే స్వపక్షంలో ఆధిపత్యానికే నాయకులు ప్రాధాన్యత ఇస్తుండటంతో కార్యకర్తలు ఎవరి వైపు ఉండాలో తెలియక నలిగిపోతున్నారు. ఇప్పటికైనా టీపీసీసీ పెద్దలు మౌనం వీడి ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో సయోధ్య కుదర్చకపోతే, వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి భారీ నష్టం తప్పదనే హెచ్చరికలు క్షేత్రస్థాయి నుంచి వినిపిస్తున్నాయి.

#Telangana Congress#Telangana Congress Politics#Telangana Congress Internal Fight#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి