దేశరాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇకమీదట సభలు, నిరసనలు నిర్వహించే వారికి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ పోలీసులు కొత్తగా నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. మైదానంలో నిర్వహించే సభలు, సమావేశాలు,ఆందోళనలకు గరిష్ఠంగా 50 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సభలు, ప్రదర్శనలకు అవకాశం ఉండనుంది. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
10 రోజుల ముందే దరఖాస్తు..
రామ్‌లీలా మైదానంలో ఏదైనా పబ్లిక్ కార్యక్రమం నిర్వహించాలనుకునే వారు ముందుగా మైదానం అందుబాటులో ఉందో లేదో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ నుంచి నిర్ధారణ చేసుకోవాలి. ఆ తర్వాత పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి.సాధారణంగా కార్యక్రమం నిర్వహించడానికి కనీసం 10 రోజుల ముందే దరఖాస్తు తప్పనిసరి కానుంది. సభలు,నిరసనలకు వచ్చే ప్రజల నిర్వహణ బాధ్యత( ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా) చూసే బాధ్యత పూర్తిగా నిర్వాహకులపై పెట్టనున్నారు.
ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం, వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు, ప్రజలను సేఫ్‌గా రానివ్వడం, పంపడం, ప్రత్యేక ప్రాంతాలను కేటాయించడం తప్పనిసరి చేయనున్నారు.రహదారులు,అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రతిపాదించారు. తుపాకులు, కత్తులు, పదునైన వస్తువులు, నిషేధిత సామగ్రిని సభా ప్రాంగణంలోకి ఇకమీదట తీసుకురావడంపై ఆంక్షలు విధించనున్నారు. రామ్‌లీలా మైదానం పరిసరాల్లో డ్రోన్లు వినియోగించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేయనున్నారు.
మైదానంకు వచ్చే ప్రజల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సహాయం, పారిశుద్ధ్య సదుపాయాలు ఏర్పాటు చేయాలి.కార్యక్రమం ముగిసిన తర్వాత చెత్తను సక్రమంగా తొలగించే బాధ్యత కూడా నిర్వాహకులపైనే పెట్టారు. కొత్త మార్గదర్శకాలకు సంబంధించిన ముసాయిదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉందని, సంబంధిత అధికారుల పరిశీలన, ఆమోదం తర్వాత తుది మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయన్నారు.


