తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి విజయం సాధించిన డీఎంకే అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే తిరస్కరించాలని కోరుతూ ఉదయనిధి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులను జస్టిస్ జి. అరుల్ మురుగన్ ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. ఈ ఎన్నికల పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణను కొనసాగించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ వివాదానికి ప్రధాన కారణం అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తేనికి చెందిన పి.మిలానీ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్. 2026 ఎన్నికల సమయంలో ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను నిబంధనల ప్రకారం సక్రమంగా పొందుపరచలేదని, నామినేషన్ పత్రాల పరిశీలనలో పలు అవకతవకలు జరిగాయని మిలానీ తన పిటిషన్‌లో ఆరోపించారు. కాగా, మే 4న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఉదయనిధి స్టాలిన్ 62,992 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి తమిళగ వెట్రి కళగం(TVK) అభ్యర్థి డి.సెల్వం (55,852 ఓట్లు)పై విజయం సాధించగా, పిటిషనర్ మిలానీకి కేవలం 30ఓట్లు మాత్రమే లభించాయి.
అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ఫలితాలు వెలువడిన 45రోజుల గడువు ముగిసిన తర్వాత జూన్ 18న ఈ పిటిషన్ దాఖలు చేశారని, కాబట్టి విచారణకు అర్హత లేదని ఉదయనిధి తరఫున వాదనలు వినిపించారు. దీనిపై స్పష్టతనిచ్చిన న్యాయమూర్తి, ఫలితాలు ప్రకటించిన రోజును మినహాయించి ఆ మరుసటి రోజు నుంచి 45 రోజుల కాలపరిమితిని లెక్కించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ఆ నిబంధన ప్రకారం పిటిషనర్ నిర్ణీత గడువు లోపునే న్యాయస్థానాన్ని ఆశ్రయించారని కోర్టు నిర్ధారించింది.
ఈ నేపథ్యంలో పిటిషనర్ లేవనెత్తిన ఆరోపణలపై నాలుగు వారాల్లోగా సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉదయనిధి స్టాలిన్‌ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ప్రాథమిక అభ్యంతరాలు వీగిపోవడంతో ఇకపై ఈ కేసులో అసలు వాదనలు, సాక్ష్యాధారాల పరిశీలన జరగనుండటం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


