రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకరేమో పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేయగా.. మరొకరు కులాన్ని సాకుగా చూపి పెళ్లి నిరాకరించడంతో మరో యువతి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. యువతుల మరణాలకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకివెళితే.. నారాయణపేట జిల్లా జౌల్లాపురం గ్రామంలో నివాసముంటున్న హన్మంతు–వెంకటమ్మ దంపతులకు కూతురు అనిత (23) ఉంది. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతోంది. గత ఏడాది తండ్రి హన్మంతు రోడ్డు ప్రమాదంలో చనిపోగా పీజీ చేసేందుకు అనిత దరఖాస్తు చేసింది. తండ్రి లేడని, తాను చదివించలేనని పెళ్లి చేస్తానని తల్లి చెప్పినా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదాకా చదువుతానని చెప్పడంతో కూలి పని చేసి కూతురిని చదివించుకుంటోంది వెంకటమ్మ.
పెళ్లి చేసుకోవాలని టార్చర్..
ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో అనితకు పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా సన్నిహితంగా ఇద్దరు సన్నిహితంగా ఉండేవారని సమాచారం. తనను పెళ్లి చేసుకోవాలని అనిల్ పదే పదే వేధించేవాడు. దీంతో అతన్ని దూరం పెట్టి అనిత చదువుకుంటోంది. దూరం పెట్టినప్పటికీ అనిల్ వేధింపులు ఆగకపోవడంతో, తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకుని అనిత ఆత్మహత్య చేసుకుంది.ఉద్యోగం వచ్చే దాకా చదువుతానని చెప్పి మధ్యలో నన్ను వదిలేసి వెళ్లిపోయావా బిడ్డా అంటూ అనిత మృతదేహం వద్ద తల్లి గుండెలు పగిలేలా రోదించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అనిల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పెళ్లికి నిరాకరించాడని..
మహబూబాబాద్ మండలం నడివాడకు చెందిన కుమారస్వామి–సుకన్య దంపతులకు కూతురు సుష్మిత (24) ఉంది. గ్రామంలో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. అయితే, అదే గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడితో రెండేళ్లుగా ప్రేమాయణం నడిపిస్తోంది సుష్మిత. పెళ్లి చేసుకుందామని ఇటీవలే అనిల్‌ను కోరగా కులం వేరని, ఇంట్లో ఒప్పుకోరని పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు.. 21 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తనను మోసం చేసిన వారిని వదలకండి అంటూ లేఖలో తల్లిదండ్రులను కోరినట్టు తెలుస్తోంది.కాగా, నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సుష్మిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


