తెలంగాణ

ఇంటర్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ లో కలిపేస్తారా? సాధ్యమేనా.. ప్రభుత్వం ముందు సవాళ్లెన్నో!

15 నిమిషాల పఠనం

ఇంటర్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేయాలన్న ఆలోచన తెలంగాణ విద్యా వ్యవస్థలో ఇప్పుడు పెను చర్చకు తెరలేపుతోంది. ఇంటర్ బోర్డు ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతోందా? లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది?

ఇంటర్‌ విలీనం.. విద్యార్థుల భవిష్యత్తుపై కొత్త చర్చ

40 శాతం డ్రాపౌట్లు అంటున్న సర్కార్‌..

గణాంకాలపైనే అధ్యాపక సంఘాల అభ్యంతరాలు

3,333 జూనియర్‌ కాలేజీల భవిష్యత్తు ఏంటి?

ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు ఒప్పుకుంటాయా?

విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళన

పదో తరగతి పూర్తయితే చాలు.. తర్వాత ఏ కాలేజీలో చేరాలి? ఎంపీసీ తీసుకోవాలా? బైపీసీ ఎంచుకోవాలా? పిల్లలను ఏ కాలేజీలో చేర్పించాలి? ఇప్పటివరకు తల్లిదండ్రుల ముందున్న ప్రశ్నలివి. కానీ ఇప్పుడు మరో కొత్త సందేహం మొదలైంది. అసలు ఇంటర్మీడియట్‌ విద్య ఉంటుందా? లేక స్కూల్‌ విద్యలోనే కలిసిపోతుందా?

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసి 12వ తరగతి వరకు ఒకే విద్యావ్యవస్థను తీసుకురావాలని భావిస్తోంది. జాతీయ విద్యావిధానంలోని 5+3+3+4 నమూనా కూడా ఇదే దిశగా ఉంది. అయితే ఈ మార్పు వల్ల విద్యార్థులకు నిజంగా ప్రయోజనం కలుగుతుందా? ఇప్పుడున్న ఇంటర్‌ వ్యవస్థను మార్చడం అంత సులభమేనా? ప్రభుత్వ వాదనల్లో అధ్యాపక సంఘాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలేంటి?

విలీనం అంటే ఇంటర్‌ కాలేజీలు మూతపడటమేనా?

ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడమంటే రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీలను మూసివేయడం కాదు. ప్రస్తుతం ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌గా ఉన్న తరగతులను 11, 12 తరగతులుగా మార్చి పాఠశాల విద్యావ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం ప్రధాన ఉద్దేశం.

అంటే ఇప్పటివరకు పదో తరగతి వరకు పాఠశాల విద్యాశాఖ, ఆ తర్వాత ఇంటర్మీడియట్‌ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా వ్యవస్థను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నది ఆలోచన. అయితే పరిపాలనా విలీనం ఒకటైతే, జూనియర్‌ కాలేజీలను పాఠశాలలుగా మార్చడం మరో అంశం. ఈ రెండింటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా వేలాది విద్యాసంస్థలు ఉన్నప్పుడు వాటన్నింటినీ ఒకే విధానంలోకి తీసుకురావడం అంత తేలికైన వ్యవహారం కాదు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, సైన్స్‌ ల్యాబ్‌లు, లైబ్రరీలు, సబ్జెక్టు నిపుణులైన అధ్యాపకులు అవసరం. ఇప్పటికే ఈ సదుపాయాలు లేని పాఠశాలలకు కొత్త వసతులు ఎలా కల్పిస్తారన్నది కీలక ప్రశ్న.

40 శాతం డ్రాపౌట్లు.. గణాంకాల్లోనే అసలు వివాదం!

ఇంటర్‌ విద్యను విలీనం చేయడానికి ప్రభుత్వం చెబుతున్న ప్రధాన కారణం పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేస్తున్నారన్నది. దాదాపు 40 శాతం మంది విద్యార్థులు పదో తరగతి తర్వాత చదువుకు దూరమవుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వాదననే అధ్యాపక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 5,16,815 మంది పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 40 శాతం మంది చదువు మానేస్తున్నారంటే దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌లో చేరడం లేదని అర్థం. కానీ 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఫస్టియర్‌లో 5,05,898 మంది అడ్మిషన్లు పొందారు. అంతకుముందు విద్యా సంవత్సరంలో 4,90,214 మంది చేరితే, ఈసారి దాదాపు 15 వేల మంది అడ్మిషన్లు పెరిగారు.

మరి ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇంటర్‌లో చేరుతున్నప్పుడు 40 శాతం డ్రాపౌట్లు ఎక్కడి నుంచి వచ్చారన్నది అధ్యాపక సంఘాల ప్రశ్న. ప్రభుత్వ గణాంకాలకు, వాస్తవ అడ్మిషన్లకు మధ్య వ్యత్యాసం ఉందని వారు ఆరోపిస్తున్నారు. డ్రాపౌట్లు తగ్గించడమే లక్ష్యమైతే ముందుగా ఆ సమస్యకు కారణాలను గుర్తించి పరిష్కరించాలి కానీ, ఏకంగా ఇంటర్‌ బోర్డునే విలీనం చేయడం ఎంతవరకు సమంజసమన్నది వారి వాదన.

టీసీలే సమస్య అయితే నిబంధనలు మార్చలేరా?

పదో తరగతి తర్వాత విద్యార్థులు ఒక పాఠశాల నుంచి టీసీ తీసుకొని మరో కాలేజీలో చేరాల్సి రావడం కూడా డ్రాపౌట్లకు కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే ఇదే సమస్య అయితే టీసీల జారీ ప్రక్రియను సరళీకరించవచ్చని అధ్యాపకులు సూచిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు టీసీల విషయంలో వెసులుబాటు కల్పించవచ్చు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్‌ పొందిన తర్వాత టీసీలను జారీ చేసే బాధ్యతను ఆయా సంస్థలకే అప్పగించవచ్చు. అవసరమైతే డిజిటల్‌ విధానంలో సర్టిఫికెట్ల బదిలీకి అవకాశం కల్పించవచ్చు. ఇలాంటి సాంకేతిక పరిష్కారాలు ఉన్నప్పుడు మొత్తం విద్యా వ్యవస్థనే మార్చాల్సిన అవసరం ఏమిటన్నది మరో ప్రశ్న.

ఒకే క్యాంపస్‌లో ఉంటే డ్రాపౌట్లు తగ్గుతాయా?

ఒకే పాఠశాలలో పదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే అవకాశం ఉంటే విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ వాదనను కూడా అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. నగరంలోని ఒక ప్రముఖ సీబీఎస్‌ఈ స్కూల్ లో పదో తరగతికి ఐదు సెక్షన్లు ఉంటే, ప్లస్‌ టూ వచ్చేసరికి ఒకటి లేదా రెండు సెక్షన్లు మాత్రమే ఉంటున్నాయని ఉదాహరణ చెబుతున్నారు. అంటే పదో తరగతి వరకు అదే పాఠశాలలో చదివిన విద్యార్థుల్లో చాలామంది ఇంటర్‌ కోసం ఇతర విద్యాసంస్థలను ఎంచుకుంటున్నారు.

దీనిని బట్టి ఒకే క్యాంపస్‌లో 12వ తరగతి వరకు విద్య అందుబాటులో ఉన్నంత మాత్రాన విద్యార్థులందరూ అక్కడే కొనసాగుతారని చెప్పలేం. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీని, తమ భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యాసంస్థను ఎంచుకునే స్వేచ్ఛను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

జేఈఈ, నీట్‌ విద్యార్థుల పరిస్థితి ఏంటి?

తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ చూపుతున్నారు. ముఖ్యంగా జేఈఈ, నీట్‌ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇంటర్‌ స్థాయి బోధన ఎంతో కీలకం. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రత్యేక శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, పోటీ పరీక్షలకు అనుగుణమైన ప్రణాళిక అవసరం.

ఇంటర్‌ విద్య ప్రత్యేక వ్యవస్థగా ఉండటం వల్లే విద్యార్థులకు ఈ తరహా శిక్షణ అందుతోందని అధ్యాపక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రేపు విలీనం తర్వాత కూడా ఇదే స్థాయి బోధన అందించగలరా? పాఠశాలల్లో ఇంటర్‌ స్థాయి సబ్జెక్టు నిపుణులు అందుబాటులో ఉంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

3,333 జూనియర్‌ కాలేజీల భవిష్యత్తు ఏంటి?

ఈ విలీనం వల్ల ఎక్కువ ప్రభావం పడే రంగాల్లో ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు ఒకటి. రాష్ట్రంలో మొత్తం 3,333 జూనియర్‌ కాలేజీలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 430 ప్రభుత్వ కాలేజీలు, 16 ఎయిడెడ్‌ కాలేజీలు, 1,453 ఇతర ప్రభుత్వరంగ కాలేజీలు, 1,434 ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి.

రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరుతున్నా, ఒక్కో కాలేజీలో సగటు అడ్మిషన్లు 150లోపే ఉంటున్నాయి. ఇప్పుడు పాఠశాలల్లోనే 11, 12 తరగతులు ప్రారంభిస్తే జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు మరింత తగ్గే అవకాశం ఉంది.

ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. ఆరేళ్ల క్రితం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మొత్తం అడ్మిషన్లు 1.96 లక్షలుగా ఉండగా, గత ఏడాదికి 1.72 లక్షలకు పడిపోయాయి. 2021-22లో ఫస్టియర్‌లో 1.10 లక్షల మంది చేరితే, 2025-26 నాటికి ఆ సంఖ్య 94 వేలకు తగ్గింది. సెకండియర్‌లోనూ 86 వేల నుంచి 67 వేలకు పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త విధానం అమలైతే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళన ఉంది.

ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు ఒప్పుకుంటాయా?

ఇంటర్‌ విద్య తెలంగాణలో పెద్ద విద్యా వ్యాపారంగా మారింది. కార్పొరేట్‌ కాలేజీలు, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు, హాస్టళ్లు, కోచింగ్‌ సంస్థలు ఈ వ్యవస్థ చుట్టూ ఏర్పడ్డాయి. విద్యార్థుల అడ్మిషన్లు, ఫీజులు, పోటీ పరీక్షల శిక్షణతో వేల కోట్ల రూపాయల వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

ఇప్పుడు ఇంటర్‌ను పాఠశాల విద్యలోకి తీసుకువస్తే ప్రైవేట్‌ కాలేజీలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. పాత కాలేజీలకు 11, 12 తరగతులు నిర్వహించే అనుమతులు ఇస్తారా? పాఠశాలలుగా మారాల్సి ఉంటుందా? కొత్తగా భవనాలు, ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలా? ఫీజుల విధానంలో మార్పులుంటాయా? అన్నది తేలాల్సి ఉంది.

అందువల్ల ఈ రంగంలో ఉన్న యాజమాన్యాలన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని సులభంగా అంగీకరిస్తాయని చెప్పలేం. తమ పెట్టుబడులు, ఉద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన హామీలు కోరడం సహజం. ప్రభుత్వం వారితో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన మార్గాన్ని రూపొందించాల్సి ఉంటుంది.

గురుకులాల్లో ప్లస్‌ టూ ఉన్నా సీవోఈలు ఎందుకు?

రాష్ట్రంలోని కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఇప్పటికే ప్లస్‌ టూ విధానం అమలవుతోంది. దాదాపు 1,400కు పైగా విద్యాసంస్థల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య అందిస్తున్నారు.

అయితే ఈ విద్యాసంస్థల్లోనూ పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురుకులాల్లోనే ఇంటర్‌ విద్య అందుబాటులో ఉన్నప్పుడు మళ్లీ ప్రత్యేక సెంటర్లు ఎందుకు అవసరమయ్యాయి? అక్కడి విద్యా విధానంలోనే అన్ని విద్యార్థులకు అవసరమైన పోటీ పరీక్షల శిక్షణ ఎందుకు అందించలేకపోతున్నారు? అన్నది అధ్యాపక సంఘాలు లేవనెత్తుతున్న మరో ప్రశ్న.

మార్పు మంచిదే.. కానీ ముందుగా స్పష్టత అవసరం!

ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన వెనుక విద్యార్థులకు దగ్గర్లోనే విద్య అందించడం, డ్రాపౌట్లు తగ్గించడం, విద్యా వ్యవస్థను సమన్వయం చేయడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. ఇవి మంచి లక్ష్యాలే. కానీ వాటిని సాధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకుండా విలీనం చేయడం వల్ల కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది.

విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి. జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. జూనియర్‌ కాలేజీల భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలి. అధ్యాపకుల ఉద్యోగ భద్రతను కాపాడాలి. ప్రైవేట్‌ విద్యాసంస్థల అనుమతులు, ఫీజుల విధానంపై పారదర్శకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి గందరగోళం లేకుండా పూర్తి వివరాలు తెలియజేయాలి.

ఎందుకంటే ఇది కేవలం ఇంటర్‌ బోర్డు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కాదు. లక్షలాది విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తును ప్రభావితం చేసే మార్పు. సంస్కరణలు అవసరమే. కానీ ఆ సంస్కరణలు విద్యార్థుల ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. అప్పుడే ఇంటర్‌ విలీనం నిజమైన విద్యా సంస్కరణ అవుతుంది. లేదంటే అంతా గందరగోళంగా మారే ప్రమాదం ఉంది.

#telangana Education#Telangana Intermediate Education#No Intermediate#Intermediate Board#Telangana Inter Board#School Education#Education Reforms#Telangana Government#Inter Students#Telangana Students#Education Policy#Intermediate Colleges#Telangana News#Education System
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి