ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఇళ్లలో, పూజా మందిరాల్లో నిత్యం పూజలందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్య చిత్రపటానికి తన కుంచెతో జీవం పోసిన ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో ఉన్న తన స్వగృహంలో గురువారం తుది శ్వాస విడిచారు. శ్రీనివాసన్ మరణవార్త తెలుసుకున్న కళాకారులు, ఆధ్యాత్మిక వేత్తలు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ పదో తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం, నాటి ప్రసిద్ధ చిత్రకారుడు కొండయ్య రాజు వద్ద చిత్రకళలో మెళకువలు నేర్చుకున్నారు. ఆయన అద్భుతమైన ప్రతిభను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) 1970లో ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆ సమయంలో తిరుమల గర్భగుడిలోని మూలవిరాట్టును అత్యంత సమీపం నుంచి నేరుగా దర్శించుకున్న శ్రీనివాసన్, స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తన కుంచెతో అత్యంత సహజంగా చిత్రించారు.
అప్పట్లో శ్రీవారు సర్వాభరణాలతో వైభవంగా అలంకరించుకున్న రూపం ఒకటి, ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా దర్శనమిచ్చే రూపం మరొకటి.. ఇలా రెండు అద్భుతమైన చిత్రాలను ఆయన తీర్చిదిద్దారు. ఈ చిత్రాలు విడుదలైన అనతికాలంలోనే భక్తుల్లో అశేష ఆదరణ పొందాయి. నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లోని దాదాపు ప్రతి హిందువు ఇంట్లో, వ్యాపార సంస్థల్లో పూజలందుకుంటున్న శ్రీవారి చిత్రం శ్రీనివాసన్ గీసినదే కావడం విశేషం.
వేంకటేశ్వరస్వామి వారి చిత్రాలతో పాటు ఆయన ఇతర హిందూ దేవతామూర్తుల చిత్రాలను సైతం అత్యంత భక్తిశ్రద్ధలతో చిత్రించి కళారంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కోవిల్పట్టిలోని మండిత్తోప్పు రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో భౌతికకాయాన్ని సందర్శించి పలువురు ప్రముఖులు, స్థానికులు కన్నీటి వీడ్కోలు పలికారు. శ్రీవారి రూపానికి తన కళతో శాశ్వతత్వాన్ని అందించిన శ్రీనివాసన్ మృతి చిత్రకళా రంగానికి తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


