నలుగురు సీపీలు మారారు.. ఫైనల్ చార్షిషీట్ ఎప్పుడు?
ఊకదప్పుడు మాటలు తప్ప చర్యలు ఏవి?
ఇచ్చిన ఫిర్యాదులు, విచారించిన అందరి వాంగ్మూలాలు ఉంటాయా?
నెల క్రితమే ఫైనల్ అయినా ఎందుకు కోర్టుకు సమర్పించడం లేదు?
ప్రత్యర్ధులతో సెటిల్మెంట్ల కోసమా?
ఆఫీసర్స్ అవినీతి అందులో కూడా ఉందా?
మూడేళ్లుగా డైలీ సీరియల్లా చెప్పించే చూడాలా?
ఆనాటి సాక్షిగా ఉన్న సీపీ మహేశ్ భగవత్ సీపీగా వచ్చారు
ఈయనైనా ఆ చార్జిషీట్ వేయగలరా?
ఫోన్ ట్యాపింగ్ కేసు స్వేచ్ఛగా ఇచ్చినా ఆధారాలు సరిపోలేదా?
రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ అనగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గుర్తుకొచ్చే తీరుపై స్వేచ్ఛ న్యూస్ ఫాలోఅప్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809,
స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్.
బీఆర్ఎస్ ట్యాపింగ్‌కు పెగాసస్‌కు తేడా తెలియదా?
ఏ ప్రభుత్వం ఉన్నా ఫోన్ ట్యాపింగ్‌లు జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీ పెరిగిన కొద్ది విచ్చలవిడి ప్రయోగాలు చేస్తుంటారు. ప్రశ్నించే వారిపై కత్తి పెడుతుంటారు. అలానే ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేసి గుప్పిట్లో పెట్టుకుంటారు. ఇదంతా అధికార పార్టీకి నష్టం వాటిళ్లుతుందని తెలియగానే చేస్తారు. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా చేసింది. అందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. ఆనాటి పోలీసుల రూపంలో ఉండే దోపిడీ దొంగల వ్యవహారం విచారణలో బయటపడింది. టాస్క్‌ఫోర్స్‌లో రాధాకృష్ణ, కూకట్ పల్లిలో భుజంగరావు, ప్రణిత్ రావు సమాచారంతో ప్రభాకర్ రావు కొడుకు కబ్జాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఫోన్ ట్యాపింగ్‌ను మావోయిస్టుల పేరుతో మిస్ యూజ్ చేసిన వైనం చాలా పెద్దది. కొత్త టెక్నాలజీలతో విషయాలు తెలుసుకున్నారు. అలానే కేంద్రంలో పెగాసస్ స్పైవేర్ అంటూ గతంలో దుమారం రేగింది. ఇప్పుడు ట్యాపింగ్ అంటూ అధికార పార్టీపై రాహుల్ గాంధీ కామెంట్ చేయగానే తెలంగాణ కాంగ్రెస్ ఉలిక్కి పడుతోంది. రాహుల్ రాక సందర్భంగా తెలంగాణలో కేసుపై కొద్ది రోజుల్లోనే ఫైనల్ చార్జిషీట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇంకెన్ని ఆధారాలు కావాలి, ఇంకెంత మంది అధికారులు మారాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎవ్వరెవరి ఫోన్స్ ఎలా ట్యాపింగ్ అయ్యాయో స్వేచ్ఛ న్యూస్ ఆనాడే చెప్పింది
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందో ఇన్వెస్టిగేషన్ అధికారుల కంటే ఎక్కువ స్వేచ్ఛ దేవేందర్ రెడ్డి సమాచారం ఇచ్చారు. ఆనాటి వార్తలు ఈనాటి ప్రతిపక్ష పార్టీ నేతల గుండెల్లో పరుగులు పెట్టించాయి. మొదట్లో అంతా మేనేజ్ చేసుకున్నాం అనుకున్న బీఆర్ఎస్ గ్యాంగ్, ఆధారాలతో నెంబర్స్‌తో పాటు వార్తలు ఇవ్వడంతో షాకయ్యారు. అందులో ఓ ఛానల్ ఓనర్ కూడా నిందుతుడిగా ఉన్నారు. వీళ్ల వ్యవహారంతో మాజీ మంత్రి తీరు బయట పెట్టింది స్వేచ్ఛ న్యూసే. ఇలా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్‌పై నిజాలు రాసి రెండేళ్లకు పైగా అవుతోంది. ఇప్పటికి ఒక్కరిని తప్ప మరెవ్వరిని నిందితుల జాబితాలో చేర్చలేదు. ఆనాడు ఛార్జిషీట్ ఫైలింగ్‌లో నెంబర్స్ సైతం మిస్టేక్స్ చేసిన ఐపీఎస్‌లు బిల్డప్ ఇచ్చారు. సిటీకి సీపీలుగా సీవీ ఆనంద్, కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, మళ్లీ సివీ ఆనంద్, సజ్జనార్ , ఇప్పుడు మహేశ్ భగవత్. ఇలా నలుగురు మారారు. సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఆనాడు విజయ్ కుమార్ టీం ఆధారాలు సేకరించింది. మరోసారి సజ్జనార్ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి అనేక ఫిర్యాదులు అందుకున్నారు. ఏఏ ఫిర్యాదులు అందుకున్నారో అధికారికంగా ప్రకటనలు చేయలేదు. ఇప్పుడు వాటిపై ఛార్జిషీట్లో ఏఏ అంశాలు పేర్కొంటారో కూడా తెలియని పరిస్థితి. ఒకప్పుడు సాక్షిగా విచారించిన మహేష్ భగవత్ ఇప్పుడు సీపీగా వచ్చారు. ఈయన అయినా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఛార్జిషీట్‌ను కొలిక్కి తీసుకొస్తారు? నెల రోజుల క్రితమే పూర్తి అయినా ఎందుకు కోర్టుకు సమర్పించడంలో జాప్యం చేస్తున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నారు.
ఏ కేసులోనూ చర్యలు లేవు
ఏదైనా నేరం జరిగితే దాన్ని ప్రభావితం చేయకుండా ఉండే విధంగా పోలీసులు కేసు నమోదు చేయగానే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. ఇది భారత దేశంలో ఐపీసీ సెక్షన్స్ ఉన్నప్పటి నుంచి ఉంది. కానీ రేవంత్ రెడ్డి మరోలా ఆలోచించారు. జైలుకు పంపితే వచ్చే వాళ్లు సీఎం అవుతారేమో, పదేళ్లు నేనే సీఎంగా ఉండాలంటే వాళ్లను జైలుకు పంపి హీరోలను చేయొద్దు అని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ వ్యూహం బెడిసి కొట్టింది. మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గోడలు దాటడం లేదు. ఛార్జిషీట్లో మరో ముగ్గురు మాజీ మంత్రుల పేర్లు చేర్చుతారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు వచ్చినా, మాజీ సీఎం పేరు పేర్కొన్నా దానితో ఒరిగేది ఎంటి? ఈ కార్ రేసింగ్‌లో ఏం చేశారు? కోర్టులో ఛార్జిషీట్ వేయగానే అరెస్ట్ చేశారా? కనీసం పాస్ పోర్ట్ కూడా సరెండర్ చేయమని ఆదేశాలు ఇవ్వడానికి వెనకడుగు వేశారు. ఎందుకంటే మీరు మొదట్లోనే అరెస్ట్ చేస్తే ఆ ప్రభావం నిందితుల వ్యవహారం వేరేలా ఉండేది. మీ వైఖరే మరోలా ఉండడంతో ఏం చర్యలు తీసుకున్నా న్యాయ వ్యవస్థ, జ్యాప్యాన్ని ఏం చేయలేరు. అన్ని ఉత్త మాటలే అవుతాయి. లక్ష కోట్ల కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నా, గడ్డం పెరిగితే బుద్ధి అన్నా సిస్టమ్‌ను మార్చలేరు.


