ఓవైపు తీవ్ర కరువు.. మరోవైపు కాంగ్రెస్ సమ్మిట్
కరువు కాలంలో సంబరాలేంటని విమర్శలు
హైదరాబాద్ లో తాగునీటి కష్టాలు
జిల్లాల్లో ఎండుతున్న పంటలు
కరువుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
తెలంగాణలో ఇప్పుడు అసలు సమస్య ఏంటి? పెట్టుబడులా? అంతర్జాతీయ గుర్తింపా? భారీ సదస్సులా? లేక ప్రజలకు తాగడానికి, రైతులకు పంటలు కాపాడుకోవడానికి నీళ్లు అందించడమా? పాలకులు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు మాత్రం మరోలా కనిపిస్తున్నాయి.
ఒకవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చెరువులు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలోనూ నీటి సరఫరాపై ఆందోళనలు మొదలయ్యాయి.
మరోవైపు ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ సదస్సులు, భారీ కార్యక్రమాలు, ఆతిథ్య ఏర్పాట్లతో హడావుడి చేస్తోంది. తాజాగా భారత్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్‌లో జరుగుతున్న కార్యక్రమం ఇప్పుడు ఇదే చర్చకు కేంద్రంగా మారింది. ప్రజలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే.. విదేశీ ప్రతినిధులకు స్టార్ హోటళ్లలో ఆతిథ్యం ఇవ్వడానికి కోట్ల రూపాయలు ఎలా అందుబాటులోకి వస్తున్నాయి? ఇదే ఇప్పుడు రేవంత్ సర్కార్‌ను చుట్టుముడుతున్న ప్రశ్న.
హైకోర్టు తలుపు తట్టిన కరువు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయస్థానం
తెలంగాణలో కరువు పరిస్థితులపై ఇప్పుడు హైకోర్టు కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, తాగునీటి కొరతపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. డిసెంబర్ 9వ తేదీలోగా తదుపరి విచారణకు ప్రభుత్వం తన వివరణ సమర్పించాల్సి ఉంది.
ఈ విచారణలో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు కూడా అత్యంత కీలకమైనవి. ఎల్‌నినో అనేది మనుషుల వల్ల ఏర్పడిన పరిస్థితి కాదని, అయితే ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉంచుతున్నారా లేదా అన్నదే తమకు ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. అంటే ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వం ఆపలేకపోవచ్చు. కానీ వాటిని ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించడం, ప్రజలకు తాగునీరు అందించడం, రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత కాదా? కరువు పరిస్థితులపై ప్రభుత్వమే సమగ్ర వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. జిల్లాల్లో ఎండుతున్న పంటలు
రాష్ట్రంలో నీటి పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. హైదరాబాద్‌లో ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో తాగునీటి కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హాస్టళ్లు, అపార్ట్మెంట్లు, నివాస ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక జిల్లాల పరిస్థితి మరింత ఆందోళనకరం. వర్షాభావంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. బోర్లు అడుగంటుతున్నాయి. ఇప్పటికే సాగు చేసిన పంటలకు నీరందక రైతులు నష్టపోతున్నారు.
365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా యాసంగి సీజన్లో సాగునీరు అందుబాటులో ఉండకపోవచ్చని హెచ్చరించారు. తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, రైతులు తక్కువ నీటితో పండే పంటల వైపు వెళ్లాలని సూచించారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ప్రభుత్వానికే తెలుసు.
మరి ఇలాంటి సమయంలో రైతులకు భరోసా కల్పించడానికి ఎంత నిధులు కేటాయించారు? పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తాగునీటి సమస్య పరిష్కారానికి జిల్లాలవారీగా ఎలాంటి కార్యాచరణ రూపొందించారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు చెప్పాల్సి ఉంది.
భారత్ సమ్మిట్ కోసం రూ.50 కోట్ల అంచనా.. ఆ డబ్బులు ఎవరివి?
ఇప్పుడు అసలు చర్చ భారత్ సమ్మిట్ గురించి. నవంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న రెండో భారత్ సమ్మిట్‌కు 70 దేశాల నుంచి వెయ్యికి పైగా ప్రతినిధులు వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల నాయకులు, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, ప్రపంచ రాజకీయ పరిణామాలు, సహకార సమాఖ్య విధానం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇలాంటి చర్చలకు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు రావడం కూడా మంచిదే. కానీ ఈ కార్యక్రమ నిర్వహణకు అయ్యే ఖర్చు ఎంత? దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నదే కీలకమైన ప్రశ్న.
ప్రస్తుత భారత్ సమ్మిట్ నిర్వహణకు సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలు వస్తున్నాయి. ఐతే రూ. 50 కోట్లకు మించి ఖర్చు కాదనే వాదనలు కూడా ఉన్నాయి. గత ఏడాది జరిగిన తొలి ఎడిషన్‌కు సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చయిందన్న విమర్శలు కూడా వచ్చాయి. విదేశీ ప్రతినిధుల విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్లలో బస, భోజనాలు, రవాణా, ఇతర ఆతిథ్య ఏర్పాట్లకు భారీ మొత్తంలో ఖర్చు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇక్కడే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నది కాంగ్రెస్ పార్టీనా? సమృద్ధ భారత్ ఫౌండేషనా? లేక తెలంగాణ ప్రభుత్వమా? ఖర్చును కాంగ్రెస్ పార్టీ భరిస్తోందా? నిర్వాహక సంస్థ చెల్లిస్తోందా? రాష్ట్ర ప్రభుత్వమే ప్రజాధనాన్ని కేటాయిస్తోందా?
ఒకవేళ ప్రభుత్వ నిధులు వినియోగిస్తుంటే ఎంత మొత్తం కేటాయించారు? ఏ శాఖ నుంచి నిధులు విడుదల చేశారు? ఏయే ఏర్పాట్లకు ఎంత ఖర్చు చేస్తున్నారు? ప్రభుత్వం ఈ వివరాలను ప్రజల ముందు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది రాజకీయ విమర్శ మాత్రమే కాదు. ప్రజల పన్నుల సొమ్ముకు సంబంధించిన ప్రశ్న అని కూడా అంటున్నాయి.
హైదరాబాద్ లోనే ఎందుకు..?
భారత్ సమ్మిట్ హైదరాబాద్ లోనే ఎందుకు..? దీనిపైనే రకరకాల విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది తొలి భారత్ సమ్మిట్‌కు కూడా హైదరాబాద్‌నే వేదికగా ఎంచుకున్నారు. ఈసారి కూడా ఇక్కడే నిర్వహించడం వెనుక రాజకీయ, వ్యూహాత్మక కోణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పాటు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కాంగ్రెస్‌కు రాజకీయంగా బలమైన రాష్ట్రాలుగా ఉన్నాయి. దక్షిణాదిలో పార్టీకి ఉన్న పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి, కాంగ్రెస్ రాజకీయ ప్రాధాన్యతను చాటుకోవడానికి హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మూడు వారాల్లో మూడు భారీ విందులు.. ఇదేనా ప్రాధాన్యత?
ఇక ఈ మధ్యకాలంలో జరుగుతున్న వరుస విందులు, ఆతిథ్య కార్యక్రమాలపైనా చర్చ జరుగుతోంది. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భారీ విందు, ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్లో ఆతిథ్యం, ఇప్పుడు భారత్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్‌లో స్టార్ హోటళ్లలో ఏర్పాట్లు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో తప్పేమీ లేదు. అంతర్జాతీయ అతిథులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం సహజమే.
కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా అంతే ముఖ్యమైనవి కదా! ఒకవైపు రైతులకు సాగునీరు అందించలేమని చెబుతూ, మరోవైపు కోట్ల రూపాయలతో భారీ ఆతిథ్య ఏర్పాట్లు చేస్తుంటే ప్రజల్లో ప్రశ్నలు రావడం సహజం. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి, పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి మధ్య తేడా ఉండాలి. పార్టీ కార్యక్రమాల ఖర్చును ప్రజలపై మోపకూడదు.
సమ్మిట్లతో తెలంగాణకు ఒరిగేదేంటి?
ప్రభుత్వం తరఫున ఒక వాదన వినిపించవచ్చు. ఇలాంటి అంతర్జాతీయ సదస్సుల వల్ల తెలంగాణకు పెట్టుబడులు వస్తాయని, హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుందని, భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని చెప్పవచ్చు. అది నిజమే కావచ్చు. కానీ ఆ ప్రయోజనాలు కేవలం ప్రసంగాలతో రావు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు రావాలి. ఒప్పందాలు జరిగితే పరిశ్రమలు ప్రారంభం కావాలి. స్థానిక యువతకు ఉపాధి లభించాలి. అందుకే సదస్సు ముగిసిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
ఎన్ని పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి? ఎన్ని కార్యరూపం దాల్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చింది? అలాగే సమ్మిట్ నిర్వహణకు అయిన మొత్తం ఖర్చును కూడా వెల్లడించాలి.
రైతుల కన్నీళ్ల కంటే.. విదేశీ అతిథుల విందులే ముఖ్యమా?
ఇక్కడే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి అసలు పరీక్ష ఎదురవుతోంది. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది భారీ వేదికలు కాదు. భారీ ప్రకటనలు కాదు. స్టార్ హోటళ్లలో విందులు కాదు. రైతులకు పంటలు కాపాడుకునే భరోసా కావాలి. గ్రామాలకు తాగునీరు కావాలి. హైదరాబాద్ ప్రజలకు నిరంతర నీటి సరఫరా కావాలి. కరువు ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం కావాలి.
కేంద్రం నుంచి రూ.30 వేల కోట్ల కరువు సాయం కోరుతున్న ప్రభుత్వం, రాష్ట్రంలో తక్షణ ఉపశమన చర్యలకు ఎంత ఖర్చు చేస్తోంది? కరువు నివారణకు ఎంత నిధులు అందుబాటులో ఉంచింది? ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ప్రజలు అడుగుతున్నది భారత్ సమ్మిట్ ఎందుకు నిర్వహిస్తున్నారని కాదు. ఆ కార్యక్రమానికి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఆ ఖర్చులో ప్రజాధనం ఎంత? ఆ డబ్బుతో ప్రజలకు ఏం ప్రయోజనం కలుగుతోంది? అని. ప్రపంచానికి తెలంగాణ గొప్పదనాన్ని చూపించడం మంచిదే. కానీ ముందుగా తెలంగాణ ప్రజల కష్టాలను ప్రపంచానికి చూపించాల్సిన పరిస్థితి రాకూడదు.
ఒకవైపు నీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు విందుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏ రకమైన ప్రాధాన్యత? పంటలు ఎండిపోతుంటే సదస్సులు ఎందుకు? గొంతులు ఎండిపోతుంటే విందులు ఎందుకు? భారత్ సమ్మిట్ ఖర్చుల లెక్కలు మాత్రమే కాదు, కరువు నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల లెక్కలు కూడా ప్రజలకు చెప్పాలని విపక్ష పార్టీల నాయకులు సీఎంను డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సమ్మిట్ వేళ.. తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.


