TG: ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. తాజాగా మహిళా ప్రయాణికులకు మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై ఏసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు భారీ రాయితీ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
15 రోజుల ఛార్జీతో నెలంతా ఏసీ బస్సుల్లో ప్రయాణం
టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించిన ఈ కొత్త ఆఫర్ ప్రకారం.. మంత్లీ బస్ పాస్ తీసుకునే మహిళా ప్రయాణికులు కేవలం 15 రోజుల ఛార్జీ చెల్లిస్తే చాలు, నెల రోజుల పాటు ఏసీ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. అంటే మంత్లీ పాస్‌పై ఏకంగా 50 శాతం రాయితీని ఆర్టీసీ అందిస్తోంది.
రేపటి నుంచే అమల్లోకి కొత్త ఆఫర్లు
ఏసీ బస్సుల రాయితీతో పాటు సాధారణ బస్ పాస్ యూజర్స్‌కి కూడా ప్రయోజనం చేకూరేలా ఆర్టీసీ మరో 9 రకాల రాయితీలను ప్రకటించింది. ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ సరికొత్త ఆఫర్లన్నీ రేపటి (శనివారం) నుంచే అమల్లోకి రానున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. నిత్యం ఏసీ బస్సుల్లో ఆఫీసులకు, ఇతర పనులకు రాకపోకలు సాగించే మహిళలకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.


