భారత్ సమ్మిట్-2026లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విమానాశ్రయం వెళ్లి లోక్సభ ప్రతిపక్ష ఎంపీకి సాదర స్వాగతం పలికారు. నేడు ఆయన గిగ్ వర్కర్లతో కలిసి ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం సమ్మిట్లో కీలక ప్రసంగం చేయనున్నారు. ఇదిలాఉండగా, హైదరాబాద్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘అభయహస్తం’లోని హామీల అమలు తీరును ప్రశ్నిస్తూ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా సంచలన పోస్టు పెట్టారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో హైదరాబాద్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలపై ప్రజలు అడుగుతున్న సాధారణ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.
రూ.లక్ష కోట్ల కేటాయింపులు ఏవి?
గత ఎన్నికల సమయంలో బీసీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, మూడేళ్లలో రూ.5వేల కోట్ల కంటే తక్కువ నిధులే ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ.. ఒక్క శాతం కూడా రాష్ట్రంలో అమలు చేయలేదని ప్రశ్నించారు. పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అంబేద్కర్ అభయహస్తం కింద రూ. 12 లక్షలు అందిస్తామని, అలాగే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 31 శాతం వాటా కల్పిస్తామని ఇచ్చిన హామీల అమలు ‘సున్నా’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రాజీవ్ యువ వికాసం అమలు చేస్తామని హామీలు ఇచ్చారని, మూడేండ్లలో కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, ఇక యువ వికాసం జాడే లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. విద్యార్థులకు రూ.5 లక్షల విలువైన 'విద్యా భరోసా కార్డు' అందిస్తామని హామీ ఇచ్చారని.. ఇంతవరకు దాని ఊసే ఎత్తలేదని ఫైర్ అయ్యారు. మైనారిటీ సంక్షేమానికి రూ.4వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని.. రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువ నిధులే విడుదల చేశారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ చేసిన ద్రోహాల జాబితాకు అంతే లేదని కేటీఆర్ విమర్శించారు.


