హైదరాబాద్ నిత్యం ఉరుకుల పరుగుల జీవనం గడిపే వారికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీచేశారు.శనివారం గిగ్ వర్కర్ల భారీ బైక్ ర్యాలీ దృష్ట్యా సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి గిగ్ వర్కర్స్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లకు ఈ పాలసీని అంకితం చేయనున్నారు.ఉదయం 10:30 గంటలకు శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి నిర్వహించే బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనన్నారు.
ట్రాఫిక్ డైవర్షన్..
ఈ క్రమంలోనే నగరంలోని పలు ప్రధాన రహదారి ఏరియాల్లో ట్రాఫిక్ అధికారులు డైవర్షన్ ఏర్పాటు చేశారు.ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. సైబర్ టవర్స్ నుంచి హెచ్ఐసీసీ (HICC), నోవాటెల్ మధ్య రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వేర్వేరు మార్గాలను అధికారులు ఏర్పాటు చేశారు. కొండాపూర్, కొత్తగూడ వెళ్లే వాహనాలను యశోద - వసంత సిటీ రోడ్ మీదుగా మళ్లిస్తుండగా.. బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే వాహనాలు ఐకియా రోటరీ - రోలింగ్ హిల్స్ మీదుగా వెళ్లాలని సూచించారు. ఇక కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వెళ్లే వాహనదారులు రాడిసన్ - ఏఐజీ - ఐకియా రోటరీ మీదుగా వెళ్లాలని పేర్కొన్నారు.
టెక్ మహీంద్రా నుంచి మెటల్ చార్మినార్ వైపు వచ్చే వాహనాలను సీఐఐ జంక్షన్ వద్ద దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ప్రయాణికులు, వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ మేరకు పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.


