గిగ్ వర్కర్లను కేంద్రంలోని మోడీ సర్కార్ బానిసలుగా మార్చాలని చూస్తోందని, దాన్ని జరగనివ్వబోమని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. వారి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా చూస్తామని తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని చెప్పారు.గిగ్ వర్కర్లకు సంబంధించిన సరైన వివరాలు లేవని, వారి శ్రమకు ఎంత ప్రతిఫలం లభిస్తోందో కూడా వారికి స్పష్టత లేదన్నారు. గిగ్ కార్మికుల సంక్షేమం కోసం గతంలో ఇచ్చిన హామీని నేడు అమలు చేస్తున్నామని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.
హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తెలంగాణ గిగ్ వర్కర్స్ పాలసీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు కేవలం కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారు. గిగ్ వర్కర్స్‌ను వెట్టిచాకిరీ కార్మికులుగా మార్చాలని ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. గిగ్ వర్కర్లను బానిసలుగా మార్చాలని, దోపిడీ చేయాలని చూస్తే ఎప్పటికీ సహించేది లేదన్నారు. మిమ్మల్ని సేవకులుగా కాదు.. అభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
వైఫైతో కూడిన భవనాలు..
గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించాలన్నదే తమ పార్టీ ప్రధాన ఆలోచన అని గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ప్రతి ఒక్క డెలివరీలో ఒక శాతం డబ్బు గిగ్ వర్కర్ల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ కొత్త చట్టం ద్వారా గిగ్ వర్కర్ల సమాచార వివరాలను ఈజీగా పొందవచ్చని రాహుల్ గాంధీ తెలిపారు. డెలివరీ, శ్రమ, ప్రతిఫలానికి సంబంధించి సమస్త వివరాలు ఇకపై నేరుగా గిగ్ వర్కర్ల మొబైల్ ఫోన్లకే వస్తాయన్నారు. గిగ్ వర్కర్ల కోసం వైఫై సౌకర్యంతో ప్రత్యేక విశ్రాంత భవనాలను సైతం అందుబాటులోకి తెస్తామన్నారు.
రూ.5 లక్షల ప్రమాద బీమా..
గిగ్ వర్కర్లు ప్రమాదాల బారిన పడి, తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడైనా ఆర్థికంగా కోలుకోలేనంతగా నష్టపోతారని రాహుల్ తెలిపారు. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఈ చట్టం ద్వారా ప్రభుత్వం రూ. 5 లక్షల ప్రమాద బీమాను అందిస్తోందని తెలిపారు. అలాగే గిగ్ వర్కర్లకు పింఛన్, సామాజిక భద్రత, పొదుపు కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.


