ప్రముఖ రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబర్ టెక్నాలజీస్ (Uber Technologies) మరోసారి భారీ డేటా బ్రీచ్ వివాదంలో చిక్కుకుంది. తమ థర్డ్ పార్టీ సాంకేతిక భాగస్వామ్య సంస్థ అయిన 'ఫైర్వర్క్స్ ఏఐ' (Fireworks AI) భద్రతా వైఫల్యం కారణంగా వేలాది మంది డ్రైవర్లకు చెందిన అత్యంత కీలకమైన వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కినట్లు ఉబర్ అధికారికంగా వెల్లడించింది. ఈ సైబర్ దాడిలో డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ వివరాలతో పాటు ఇతర సున్నితమైన రికార్డులు బహిర్గతం కావడం సాంకేతిక వర్గాల్లో, డ్రైవర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ఫైర్వర్క్స్ ఏఐ సంస్థకు చెందిన అంతర్గత లాగిన్ క్రెడెన్షియల్స్‌ను గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు దొంగిలించి, వాటి సాయంతో ఉబర్ ఖాతాలోని డేటాను యాక్సెస్ చేసినట్లు విచారణలో తేలింది. అక్టోబర్ 9న ఫైర్వర్క్స్ ఏఐ నుంచి ఈ సమాచారం అందిన వెంటనే ఉబర్ అప్రమత్తమైంది. ఆ సంస్థతో ఉన్న అన్ని డేటా కనెక్షన్లను తక్షణమే నిలిపివేసి, అంతర్గత దర్యాప్తునకు ఆదేశించినట్లు ఉబర్ పేర్కొంది. ఆర్థిక లాభాల కోసం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) టోకెన్లను విక్రయించే ఓ సైబర్ ముఠా ఈ దాడికి పాల్పడినట్లు ఫైర్వర్క్స్ ఏఐ అనుమానిస్తోంది.
ఈ ఘటనలో దేశవ్యాప్తంగా మొత్తం ఎంతమంది డ్రైవర్లు ప్రభావితమయ్యారనే కచ్చితమైన సంఖ్యను ఉబర్ బయటపెట్టనప్పటికీ, అమెరికాలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు సమర్పించిన నివేదికల ప్రకారం దాదాపు 9 వేల మందికి పైగా డ్రైవర్ల సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. సౌత్ కరోలినాలో 3,430 మంది, మసాచుసెట్స్‌లో 2,567 మంది, రోడ్ ఐలాండ్‌లో 1,873 మంది, వెర్మోంట్లో 1,071 మంది డ్రైవర్ల లైసెన్స్, ప్రభుత్వ గుర్తింపు కార్డుల వివరాలు చోరీకి గురయ్యాయి. వీరితో పాటు కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ రాష్ట్రాల డ్రైవర్లకు కూడా ఉబర్ నోటీసులు జారీ చేసింది.
ప్రభావితమైన డ్రైవర్లకు 'సైబర్స్కౌట్' (Cyberscout) ద్వారా 90 రోజుల పాటు ఉచిత క్రెడిట్ మానిటరింగ్, ఫ్రాడ్ సహాయక సేవలను అందిస్తున్నట్లు ఉబర్ ప్రకటించింది. ఇప్పటివరకు లీకైన సమాచారం దుర్వినియోగమైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసినప్పటికీ, డ్రైవర్లు తమ బ్యాంక్ ఖాతా లావాదేవీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించింది. కాగా, ఈ ఏడాది ఆగస్టులో ఉబర్ ఫ్రైట్ విభాగంలోనూ డేటా చోరీ జరగడం గమనార్హం.


