బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా సింగరేణి సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ఉమ్మడి వరంగల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల నిర్వహణ స్తంభించిపోయింది. వర్షపు నీరు భారీగా వచ్చి చేరడంతో గనుల్లో తవ్వకాలు నిలిచిపోయి కార్మికులు, యాజమాన్యం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని ప్రముఖ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. నీటి ఉధృతి పెరగడంతో దాదాపు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోగా, కేటీకే (KTK) 1, 2 ఓపెన్ కాస్ట్ గనుల్లోనూ దాదాపు 10 వేల టన్నుల ఉత్పత్తి ఆగిపోయింది. గనుల్లోకి వెళ్లే రహదారులు బురదమయంగా మారడంతో భారీ షవల్స్, డంపర్లు వంటి యంత్రాలు పూర్తిగా నిలిచిపోయి రవాణా వ్యవస్థ ఆగిపోయింది.
ఎడతెరిపి లేని వర్షాల మూలంగా సింగరేణి సంస్థకు దాదాపు రూ.40కోట్ల మేర భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గనుల బావుల్లోకి చేరిన నీటిని బయటకు తోడేందుకు (మోటార్ పంపింగ్) అత్యవసరంగా రెస్క్యూ పనులు ప్రారంభించారు. నీటిని వేగంగా పంప్ అవుట్ చేసి పరిసరాలను వేగంగా యథాస్థితికి తీసుకురావడానికి సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.
ఆకాశం మేఘావృతమై వర్షం తగ్గకపోవడంతో బొగ్గు తవ్వకం, మట్టి తొలగింపు పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. వాతావరణం అనుకూలించి వర్షం పూర్తిగా తగ్గితేనే మళ్లీ గనుల్లో బొగ్గు వెలికితీత పనులను పునఃప్రారంభిస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా డంప్ యార్డుల నుంచి ప్రత్యామ్నాయ రవాణా చర్యలు చేపడుతున్నారు.








