Cm Revanth: కొంతమందికి నష్టం జరిగినా కొన్ని తరాలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలని తమ్మిడికుంటను అభివృద్ధి చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 14 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువును 30 ఎకరాలకు విస్తరించామన్నారు. అక్కినేని నాగార్జున మంచి మనసుతో ముందుకు వచ్చి 2 ఎకరాలు ప్రభుత్వానికి అందించారని సీఎం రేవంత్ తెలిపారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా నాగార్జున హీరోగా నిలిచారని కితాబిచ్చారు.
హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన హైటెక్ సిటీ ప్రాంతంలో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నగరంలో చెరువులను చెరబట్టిన వారి నుంచి విముక్తి కల్పించడంలో ఎలాంటి సమస్యలొచ్చినా ఎదుర్కొని నిలబడి పరిష్కరించి నగరాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్.

50శాతం చెరువులు మాయం
హైదరాబాద్ అంటేనే రాక్స్ అండ్ లేక్స్ సిటీ అని పేర్కొన్నారు. హైదరాబాద్ లో 1372 చెరువులుంటే రకరకాల కారణాలతో 50శాతం చెరువులు మాయమయ్యాయని తెలిపారు. చెరువుల ఆక్రమణలతో వర్షాలు వస్తే రోడ్లపై నీళ్లు నిలిచే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాలనీలు జలమయం అవుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిపై ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు.
ఆనాడు మూసీ వరదల నుంచి నగరాన్ని కాపాడేందుకు నిజాం.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించారని వెల్లడించారు. వికారాబాద్ నుంచి మొదలైన ముచుకుందా నది మూసా, ఈసా కలసిన చోట మూసీగా మారిందన్నారు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో నదీ నాగరికత అభివృద్ధి చెందిందన్నారు. ఆనాడే ఇది గుర్తించి వందేళ్ళ క్రితమే మూసీ నదీ పరివాహకాన్ని నిజాం అభివృద్ధి చేశారని చెప్పారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టాలనే తపన
కానీ ఇప్పుడు మూసీ కాలుష్యమయంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని రేవంత్ వాపోయారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితి మారాలనే మూసీ పునరుజ్జీవనం చేపట్టాలని నిర్ణయించామన్నారు. ప్రకృతిని పరిరక్షించాలన్నదే తన ఆలోచన అని, హైదరాబాద్ ను విశ్వనగరంగా నిలబెట్టడం కోసమే మా తపన అని స్పష్టం చేశారు. అందులో భాగంగానే చెరువులను పునరుద్దరిస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన అందరినీ అభినందించారు.
ఎవరు తిట్టినా.. మూసీ ప్రక్షాళన ఆగదు
మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందే అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మూసీ ప్రక్షాళనలో ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఇందుకు కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే మూసీ పునరుజ్జీవం తొలి దశ పనులు ప్రారంభించుకోబోతున్నామన్నారు. నగర ప్రజల జీవితాలు మూసీ నదితో ముడిపడి ఉన్నాయన్నారు. నదుల పేర్లు ఆడబిడ్డలకు పెట్టుకునే సంస్కృతి మనది అని అన్నారు. మూసీ నది సుందరీకరణ కాదు.. మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామన్నారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిందే.. చెరువులను ఆక్రమణల చెర నుంచి విడిపించాల్సిందే అని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు.
ఇక నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట
ఎన్నికలప్పుడే రాజకీయాలు అన్న ముఖ్యమంత్రి రేవంత్.. అభివృద్ధికి రాజకీయాలకి అతీతంగా కలిసి రావాలని కోరారు. నిన్నటి వరకు శిల్పారామం గురించే మాట్లాడుకున్నారు, ఇవాళ్టి నుంచి తమ్మిడికుంట గురించి మాట్లాడుకుంటారని సీఎం రేవంత్ అన్నారు. ''ఇక నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట అంటారు. ఇక్కడ భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశిస్తున్నా. ఇక్కడ లేక్ ఎకానమీని అభివృద్ధి చేసుకుందాం. చెరువు ఆవరణలో ఒక జమ్మి చెట్టును నాటాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి సూచన చేస్తున్నా. అలా చేస్తే దసరా వేడుకలకు చెరువులు వేదికగా మారుతాయి. మన సంస్కృతిని కాపాడుకోవడానికి చెరువులు వేదిక అవుతాయి'' అని సీఎం రేవంత్ అన్నారు.


