తెలంగాణ

TG: ‘ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు’.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!

6 నిమిషాల పఠనం

TG: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు ప్రకృతి తెచ్చినవి కావని, రేవంత్ రెడ్డి వంటి పాలకుల ‘వికృతి’ వల్ల వచ్చిన కృత్రిమ కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.

TG: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు ప్రకృతి తెచ్చినవి కావని, రేవంత్ రెడ్డి వంటి పాలకుల ‘వికృతి’ వల్ల వచ్చిన కృత్రిమ కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న రాజకీయ కక్ష్యతోనే వేలాది టీఎంసీల ప్రాజెక్టుల నీటిని దిగువకు వదిలేసి, తెలంగాణ రైతుల గొంతు ఎండగట్టారని మండిపడ్డారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘రైతు గర్జన’ భారీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

ఆంధ్రా ప్రాజెక్టులు కళకళ.. మన రిజర్వాయర్లు వెలవెల

సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "పట్టిసీమ దగ్గర ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీటిని ఎత్తిపోసుకుంటుంటే.. రేవంత్ రెడ్డి కన్నేపల్లి, దేవాదుల దగ్గర గోదావరి జలాలను ఎందుకు ఎత్తిపోయలేదు? కక్ష సాధింపుతోనే కృష్ణ, గోదావరి నదుల్లో దాదాపు వెయ్యి టీఎంసీల నికర జలాలు వృధాగా సముద్రం పాలయ్యేలా చేశారు. ఆ నీటిని ఎత్తిపోసి ఉంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వంద టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేవి. గోదావరి తీరాన ఉన్న నిర్మల్ జిల్లాలోని 9 మండలాలు నేడు కరువు కోరల్లో చిక్కుకునే దుస్థితి వచ్చేది కాదు. పొరుగున ఉన్న ఆంధ్రకు నీళ్లు పారించి.. తెలంగాణ రైతులకు ఎక్కిళ్లు పెట్టిస్తున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు సమస్యలను వదిలేసి.. నా గడ్డంపై ఫికరా?

రైతుల కష్టాలను పరిష్కరించడం చేతకాక సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. "మొన్న కొడంగల్ సభలో రేవంత్ మాట్లాడుతూ.. నక్క పులిని చూసి వాతలు పెట్టుకున్నట్లు కేటీఆర్ నా లెక్క కావాలని ప్రయత్నిస్తున్నాడని నా గడ్డం గురించి ప్రస్తావించారు. నేను ఆయన లెక్క కావాలనుకుంటే.. రోజూ జనం పెడుతున్న శాపనార్థాలు, తిట్లకు ఎప్పుడో బకెట్ నీళ్లలో పడి చచ్చిపోయేవాడిని. రాష్ట్రంలో రైతులు ఇంతటి ఘోరమైన సంక్షోభంలో ఉంటే.. వాటిని పరిష్కరించాల్సింది పోయి నా గడ్డంపై ఫికర్ పడుతున్నారు. ఉత్తుత్తి మాటలు, ఉపన్యాసాలతో రైతుల కడుపు నిండదు" అని చురకలంటించారు.

తక్షణమే 4 విడతల రైతుబంధు ఇవ్వాల్సిందే

కాంగ్రెస్ సర్కార్ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. గతంలో ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధుతో పాటు, ప్రస్తుత యాసంగి పంట పెట్టుబడి సహాయాన్ని కలిపి వెంటనే 4 వాయిదాల నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. మిగిలిపోయిన రూ.2 లక్షల రుణమాఫీని పూర్తి చేయాలని, పంట రుణాలను వెంటనే రీషెడ్యూల్ చేయాలని, రైతు కూలీలకు ఇస్తామన్న నెలకు రూ.1,000 చొప్పున బకాయిపడ్డ మొత్తం రూ.36 వేలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వైఫల్యాలపై ఫైర్

నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కారని కేటీఆర్ విమర్శించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ సిటీ, రైల్వే లైన్, పేదలకు పట్టాలు ఇస్తామని చెప్పి మాట తప్పారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపిస్తే ఆ పార్టీ ప్రజలకు ఇచ్చింది శూన్యమని మండిపడ్డారు. తెలంగాణకు కేసీఆర్ మార్గదర్శకత్వమే శ్రీరామరక్ష అని, రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

#Telangana#Telangana News#KTR#Kalvakuntla Taraka Rama Rao#BRS#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి