జాతీయం

Agriculture Business: 2 రూపాయాల ఐడియాతో మొదలైన ప్రయాణం.. 500 కుటుంబాల తలరాత మార్చిన రైతు!

5 నిమిషాల పఠనం

Agriculture Business: లక్షల రూపాయల పెట్టుబడి ఉంటేనే పెద్ద వ్యాపారం చేయగలమని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ఆలోచన, పట్టుదల ఉంటే కేవలం రెండు రూపాయల ఐడియాతో కూడా కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చని నిరూపించాడు ఓ సామాన్య రైతు. ఒడిశాలోని అంగుల్ జిల్లాకు చెందిన సంతోష్ సాహు, ఒక చిన్న నిమ్మతోట ప్రయోగాన్ని ఏకంగా అమెరికా, యూకే వరకు ఎగుమతి చేసే ఇంటర్నేషనల్ బిజినెస్‌గా మార్చాడు.

Agriculture Business: లక్షల రూపాయల పెట్టుబడి ఉంటేనే పెద్ద వ్యాపారం చేయగలమని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ఆలోచన, పట్టుదల ఉంటే కేవలం రెండు రూపాయల ఐడియాతో కూడా కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చని నిరూపించాడు ఓ సామాన్య రైతు. ఒడిశాలోని అంగుల్ జిల్లాకు చెందిన సంతోష్ సాహు, ఒక చిన్న నిమ్మతోట ప్రయోగాన్ని ఏకంగా అమెరికా, యూకే వరకు ఎగుమతి చేసే ఇంటర్నేషనల్ బిజినెస్‌గా మార్చాడు. తాను ఏడాదికి రూ. కోటికి పైగా టర్నోవర్ సాధించడమే కాకుండా, తన చుట్టుపక్కల ఉన్న 500 రైతు కుటుంబాల తలరాతను మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

రూ. 2 మొక్కలతో మొదలైన ప్రయోగం..

ఈ సక్సెస్ స్టోరీకి బీజం వేసింది సంతోష్ తండ్రి కార్విక్ సాహు. తమ పొలంలో ఏనుగులు, కోతుల దాడులను తట్టుకుని నిలబడే పంట కోసం వెతుకుతూ ఆయన నిమ్మసాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఉద్యానవన శాఖ నుంచి ఒక్కో మొక్కను రూ. 2 చొప్పున 50 'కాగ్జీ' నిమ్మ మొక్కలను కొనుగోలు చేసి, కేవలం రూ. 100 పెట్టుబడితో ఈ సాగు మొదలుపెట్టారు. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో గ్రామంలోని మిగతా రైతులు కూడా నిమ్మసాగుపై ఆసక్తి చూపించారు. అయితే ఏడేళ్ల క్రితం తండ్రి మరణించడంతో సంతోష్ ఈ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు.

అగ్రిగేటర్ బిజినెస్ మోడల్.. కోటి రూపాయల టర్నోవర్

నిమ్మకాయలు బాగా పండుతున్నా, స్థానిక మార్కెట్లలో సరైన ధర రాక రైతులు ఇబ్బంది పడటాన్ని సంతోష్ గమనించాడు. వెంటనే ఆ సమస్యనే తన బిజినెస్ ఐడియాగా మార్చుకున్నాడు. తన ఎకరం పొలంలో పండే నిమ్మకాయలతో పాటు, మరో 200 మంది రైతుల నుంచి నేరుగా నిమ్మకాయలను కొనుగోలు చేయడం స్టార్ట్ చేశాడు. 100 నిమ్మకాయలను రూ. 220 నుంచి రూ. 280 మధ్య కొని, వాటిని గ్రేడింగ్ చేసి పెద్ద మార్కెట్లలో రూ. 300 నుంచి రూ. 320 వరకు అమ్ముతున్నాడు. సంతోష్ వ్యాపారం అంగుల్, భువనేశ్వర్, కటక్, ధెంకనాల్ మీదుగా జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ వరకు విస్తరించింది. అంతేకాదు, ఇక్కడ పండే నాణ్యమైన నిమ్మకాయలు నేడు అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మార్కెట్లకు కూడా ఎగుమతి అవుతున్నాయి. కేవలం కాయల బిజినెస్ మాత్రమే కాకుండా, సొంతంగా నిమ్మ మొక్కలను పెంచి ఒక్కో మొక్కను రూ. 20 చొప్పున అమ్ముతూ మరో ఆదాయ మార్గాన్ని కూడా ఏర్పరచుకున్నాడు.

500 కుటుంబాలకు ఉపాధి..

సంతోష్ సాగు చేసే 'కాగ్జీ నిమ్మ' రకానికి మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీటి తొక్క పలుచగా ఉండి, రసం ఎక్కువగా వస్తుంది. ఒకసారి మొక్క నాటితే 3 నుంచి 4 ఏళ్లలో కాపు మొదలై, చెట్టు వయసు పెరిగే కొద్దీ దిగుబడి పెరుగుతుంది. తన మొత్తం రాబడిలో 60 శాతం కొనుగోళ్లకే ఖర్చయినా, ఏడాదికి రూ. కోటికి పైగా టర్నోవర్‌తో సంతోష్ భారీ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఒకప్పుడు నష్టాలతో సతమతమైన ఆ ప్రాంతంలో, నేడు సంతోష్ చూపిన బాటలో సుమారు 500 రైతు కుటుంబాలు నిమ్మసాగు చేస్తూ ఆర్థికంగా బలోపేతమయ్యాయి. తక్కువ పెట్టుబడితో కొత్త బిజినెస్ చేయాలనుకునే వారికి ఈ 'అగ్రిగేటర్ మోడల్' ఒక అద్భుతమైన పాఠం.

#Agriculture Business#Farmer Success Story#Santosh Sahu#Odisha Farmer#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి