Telangana: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు కీలక సూచన చేశారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు ఒకే పంటపై ఆధారపడొద్దని మంత్రి సూచించారు. పంటల వైవిధ్యంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలన్నారు. పాడి పరిశ్రమ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి రంగాలను వ్యవసాయంతో అనుసంధానం చేసుకుంటే ప్రతిరోజు ఆదాయం పొందవచ్చన్నారు. వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని రైతులకు సూచించారు.
మరోవైపు మురసు తుపాను నేపథ్యంలో పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. పంటలకు నష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమీకృత వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల. ఎల్ నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్ లో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి తక్కువ నీటితో సాగయ్యే చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ల పద్దతులతో నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.
అన్నదాతల ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులోనే పురుగు మందులు వినియోగించాలన్నారు. పిచికారీ సమయంలోనూ తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించాలన్నారు.


