* విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట
* గంగబండ తండా వద్ద హాస్పిటల్ నిర్మాణ పనుల పరిశీలన
* జూన్ నాటికి ఆసుపత్రిని సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశం
* తిరుమలాయపాలెంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత
Khammam: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
45 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రి
కూసుమంచి మండల కేంద్ర సమీపంలోని గంగ బండ తండా వద్ద రూ.45 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను మంత్రి పరిశీలించారు. నిర్దిష్ట గడువు మేరకు జూన్ నెల నాటికి శరవేగంగా పనులు పూర్తి చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలని అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఆ తర్వాత సుమారు రూ.3.20 కోట్ల అంచనా వ్యయంతో ఏదులాపురం మున్సిపాలిటీ 14,15,16 వార్డుల్లో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
వైద్య రంగానికి పెద్దపీట
పేదలు అనారోగ్యం బారిన పడితే వారు ఆర్థికంగా చితికి పోకుండా మెరుగైన వైద్య సేవలు అందించేలా ఈ 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. పూర్తిస్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ పాలనలో పేదలకు ఏదైనా జబ్బు చేస్తే.. రోడ్డున పడే పరిస్థితి ఉండేదని, తమ ప్రజా పాలనలో మాత్రం విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆరోగ్య భరోసా అందిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా.. కోట్లాది నిధులతో పేదలకు ఆర్థిక తోడ్పాటు ఇచ్చామన్నారు. ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరుస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత
తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో అర్హులైన 187 మంది లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు మంత్రి పొంగులేటి. మండలంలో ఇప్పటికే మొదటి విడత 800 ఇళ్లు ఇచ్చామన్నారు. అందులో 600లకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. అనంతరం కల్యాణ లక్ష్మి/షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. తిరుమలాయపాలెంలో సుమారు రూ.2 కోట్లతో తెట్టెలపాడు-బీరోలు రోడ్డు నుంచి ఏలువారిగూడెం వరకు చేపట్టిన బీటీ రోడ్డు, బీరోలులో సుమారు రూ.48 లక్షలతో తాగునీటి నిల్వ ట్యాంక్ (OHSR) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి.


