ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఒక జోకర్, బ్రోకర్ అని తుంగతుర్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీర్ల ఐలయ్య మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. డిఫెండర్ కారు కొన్నానని గతంలో బీర్ల ఐలయ్య దావత్ ఇచ్చాడని, కారుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే తన కొడుకు కొనిచ్చాడని చెప్పాడని గుర్తుచేశారు. ‘స్కూలుకు వెళ్లే నీ కొడుకు కారు ఎలా కొనిచ్చాడు? 15 నుంచి 20 వేల ఎకరాల సీలింగ్ భూములను బ్రోకరిజం చేసి స్పెక్ట్రా అనే సంస్థకు కట్టబెట్టి అడ్డగోలుగా దోచుకున్నావ్’ అని ఆరోపించారు.
‘ఆ సంస్థ దగ్గర ప్లాట్లు కొన్నవాళ్లందరూ ఇప్పుడు మోసపోయారని, ఇలాంటి జోకర్,బ్రోకర్వి నువ్వు కూడా కేటీఆర్ గురించి మాట్లాడతావా?’అంటూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఫైర్ అయ్యారు. ఓడిపోతానని భయంతోనే రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో సభలు పెట్టాడని, గడ్డం పెంచితే రేవంత్ రెడ్డి లాగా అవ్వరని అంటున్నారని.. నిజమే కేటీఆర్ ఎన్నటికీ రేవంత్ రెడ్డి లాగా లంగ, దొంగ కాడని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమంలో అయినా కేసీఆర్ జపమే చేస్తున్నాడని, ఆఖరికి మొన్న గ్రూప్ -1 అభ్యర్థుల సమావేశంలో కూడా కేసీఆర్ జపమే చేశాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఫాం హౌసులకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో వెళ్ళి ఏం పీకారని, దమ్ముంటే రైతుల దగ్గరికి బస్సులో వెళ్ళాలని, కుక్కని కొట్టినట్లు కొడతారని సవాల్ విసిరారు. ఒక్కడు కూడా మళ్లీ తిరిగి హైదరాబాద్ రాలేరని వెల్లడించారు.
రూ.100 కోట్ల ప్రజాధనం వృథా చేసి భారత్ సమ్మిట్ పెడుతున్నారని, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు భారత్ సమ్మిట్ పెట్టేందుకు నిరాకరించారని గాదరి కిషోర్ కుమార్ వెల్లడించారు.కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ సొమ్ము వృథా చేస్తూ ఇక్కడ భారత్ సమ్మిట్ పెడుతున్నాడని, తాగడానికి నీళ్లు లేవు అంటే భారత్ సమ్మిట్ ఎందుకు? అని ప్రశ్నించారు. గత ఏడాది పెట్టిన సమ్మిట్ వల్ల వచ్చిన లాభాలు ఏంటని నిలదీశారు.. ‘మీరు తాగి తందనాలు ఆడాలంటే మీ డబ్బులతో పెట్టుకోండి, మా ప్రజల డబ్బులతో కాదు’ కదంటూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


