Telangana BJP: తెలంగాణ బీజేపీలో పదవులు అనుభవిస్తున్న నేతలకు ఇప్పుడు అధిష్టానం పెద్ద షాక్ ఇచ్చింది. కేవలం పార్టీ పదవి తీసుకున్నామా, హైదరాబాద్ ఆఫీసు చుట్టూ తిరిగామా అన్నట్లుగా వ్యవహరిస్తే ఇకపై కుదరదని ఢిల్లీ పెద్దలు తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయిలో ఎవరు ఎంత చురుగ్గా పనిచేస్తున్నారు? ఎన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు? అన్న వివరాలను తేల్చేందుకు నేతల పనితీరుపై నిఘా పెట్టింది. ప్రతి నెలా ప్రోగ్రెస్ 'రిపోర్ట్ కార్డు' సమర్పించాలన్న అధిష్టానం కొత్త రూల్ ఇప్పుడు రాష్ట్ర కమలం నేతల్లో తీవ్ర టెన్షన్ రేపుతోంది.
సునీల్ బన్సల్ వార్నింగ్.. నెలవారీ లెక్కలు షురూ!
గత నెలలో రాష్ట్రానికి వచ్చిన బీజేపీ ఇంచార్జీ సునీల్ బన్సల్, సహ ఇంచార్జీలు అభయ్ పాటీల్, రేఖా శర్మతో పాటు సంస్థాగత ప్రధాన కార్యదర్శులు మధుకర్, దశరత్ వరుస సమావేశాలు నిర్వహించారు. బాధ్యతల్లో ఉన్న నేతలు ఇప్పటివరకు ఏం చేశారు? జిల్లాల్లో ఎంతవరకు పర్యటించారు? అంటూ సునీల్ బన్సల్ నేరుగా ప్రశ్నించారు. అంతేకాదు, ప్రతి నేత తమ పర్యటనలు, కార్యక్రమాల వివరాలను ఒక నిర్దిష్ట ఫార్మాట్‌లో నివేదించాలని ఆదేశించారు. దీంతో అక్టోబర్ నెలకు సంబంధించిన టూర్ వివరాలు, కార్యక్రమాల నివేదికలను రాష్ట్ర పార్టీ కార్యాలయం కోరుతోంది.
పని అప్పగించకుండానే రిపోర్టులా? నేతల గుసగుసలు!
అధిష్టానం ఆదేశాలతో కొందరు స్టేట్ ఆఫీస్ బేరర్లు ఇప్పటికే తమ రిపోర్టులను అందజేశారు. అయితే, మిగతా నేతల నుంచి మాత్రం అసహనం వ్యక్తమవుతోంది. తమకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించకుండా, ఏం చేయాలో స్పష్టత ఇవ్వకుండా ఇప్పుడు నెలవారీ రిపోర్టులు అడిగితే ఎలా అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. ముందుగా నిర్దిష్టమైన పని అప్పగించి, ఆ తర్వాత పనితీరుపై లెక్కలు అడగాలన్నది వారి వాదనగా ఉంది.
పని చేయకపోతే పదవి ఊడినట్లేనా?
మరోవైపు, ఈ 'రిపోర్ట్ కార్డు' విధానంతో పార్టీలో జవాబుదారితనం పెరుగుతుందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇకపై బాధ్యతలు తీసుకున్న వారు తమకు ఏం పని ఉందో అడిగి మరీ క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. పార్టీ కోసం సమయం కేటాయించలేని వారు పదవుల నుంచి తప్పుకోవాల్సి రావచ్చన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. మొత్తానికి బీజేపీలో పదవులు హోదా కోసం కాదని, పని చేసి నిరూపించుకోవడానికేనని అధిష్టానం గట్టి సంకేతాలు పంపింది. మరి ఈ 'రిపోర్ట్ కార్డు' దెబ్బతోనైనా కమలం నేతల్లో కదలిక వస్తుందో లేదో వేచి చూడాలి.


