ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్‌గా జై షా (Jai Shah) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోనేషియా దేశంలోని బాలిలో సోమవారం నిర్వహించిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్లు జై షా పేరును ప్రతిపాదించగా, ఎటువంటి పోటీ లేకుండా ఆయనను రెండోసారి ఛైర్మన్‌గా బోర్డు ఎంపిక చేసింది.
క్రికెట్‌ను అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం, గేమ్‌కు అభిమానుల నుంచి ఆదరణ పెంచడం, వాణిజ్యపరమైన వృద్ధిని సాధించే కీలక సమయంలో జై షా లీడర్ షిప్ ఎంతో అవసరమని ఐసీసీ బోర్డు భావించినట్టు తెలిసింది. రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక కావడంపై జై షా స్పందించారు. తనపై ఐసీసీ బోర్డు ఉంచిన నమ్మకానికి, డైరెక్టర్ల నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ఐసీసీ ఛైర్మన్‌గా సేవలందించడం ఒక గౌరవంతో పాటు పెద్ద బాధ్యత.
అంతర్జాతీయంగా క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి నేను కట్టుబడి ఉన్నా. ఆటగాళ్లు, అభిమానులు, వాణిజ్య భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రికెట్‌కు బలమైన, సుస్థిరమైన భవిష్యత్‌ను నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు. ఇదిలాఉండగా, 2024 డిసెంబర్ 1న గ్రెగ్ బార్క్లే స్థానంలో మొదటిసారి ఐసీసీ ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
కేవలం 38 ఏళ్లకే అత్యున్నత పదవిని చేపట్టడంతో ఐసీసీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన చైర్మన్‌గా జై షా రికార్డు సృష్టించారు. జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్.శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ తర్వాత ఐసీసీకి నాయకత్వం వహిస్తున్న ఐదో భారతీయుడిగా జై షా సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు.ఇదిలాఉండగా, క్రీడలకు సంబంధించి ఎటువంటి అనుభవం లేకుండా క్రికెట్ అంటే తెలియని వ్యక్తికి గతంలో బీసీసీఐ అధ్యక్షడి హోదా, ఇప్పుడు ఐసీసీ చైర్మన్ పదవి ఎలా వచ్చిందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.


