రాష్ట్రంలో కరువు ఛాయలు క్రమంగా బలపడుతుండటంతో అధికార పార్టీకి చెందిన నేతలకు భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలు సైతం జరగాల్సి ఉన్నది. అన్నదాతలకు సాగు నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నది. మున్ముందు తాగు నీటికి కూడా కొరత ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుందని, క్షేత్రస్థాయిలో ఇప్పటికే పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన కామెంట్స్ చేసినట్టు సమాచారం.
తెలంగాణలో కరువు తీవ్రతరం కావడం, కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు తెలుస్తోంది. కరువు తర్వాత అధికార పార్టీ గెలిచినట్టు చరిత్రలో లేదని, హైటెక్ సిటీ కట్టానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కూడా కరువు వచ్చాక జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడని గుర్తుచేసినట్టు తెలిసింది.
తాగు నీటికి ఇబ్బందే..
ఎల్ నినో ప్రభావం గ్రామాల్లో తీవ్రంగా ఉందని, నీళ్లు, కరెంటుకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే రోజులు రానున్నాయని పేర్కొన్నట్టు సమాచారం. జనవరి నెల తర్వాత తాగడానికి నీళ్లు కూడా దొరికే పరిస్థితి లేదని, ప్రభుత్వం ఎల్ నినో పరిస్థితులను అంచనా వేయలేకపోతుందని, ఇలాగే కొనసాగితే పార్టీకి మరోసారి అధికారం రావడం కష్టమే అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.జూన్ తర్వాత కూడా ఎల్నినో ఇలాగే కొనసాగితే అధికార పార్టీ ఓడిపోవాల్సిందేనని మంత్రి తుమ్మల ముందస్తుగానే జోస్యం చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.
గాలికి పెన్షన్ పెంపు మాటలు..
గత ఎన్నికల సమయంలో లబ్ధిదారులకు పింఛన్ పెంచుతామని ప్రకటించారని, ఆ హామీ ఏమైందని గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది.గత ప్రభుత్వంలో ఆనాటి సీఎం కేసీఆర్ ఇచ్చినంతే మీరు ఇస్తున్నారని, పింఛను పెంచుతామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదని ప్రజలు అడుతున్నారని, వారు చెప్పేది నిజమే కదా? అని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో 45 లక్షల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని, వాళ్ల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదా? అని పార్టీ పెద్దలకు పరోక్షంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.


