SBI Credit Card: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు యూజర్స్‌కి బిగ్ షాక్ తగలనుంది. మరో 15 రోజుల్లో అంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎస్‌బీఐ కార్డ్స్ రూల్స్‌లో భారీ మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు, ఇంధన కొనుగోళ్లపై అదనపు ఛార్జీల బాదుడుకు ఎస్‌బీఐ సిద్ధమైంది. ఈ కొత్త రూల్స్ అన్ని కేటగిరీల ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులకు వర్తించనున్నాయి. కాబట్టి ఈ నిబంధనలపై అవగాహన లేకపోతే డిసెంబర్ 1 నుంచి మీ జేబుకు అదనపు చిల్లు పడటం ఖాయం.
ట్రావెల్ ఖర్చులు రూ. 30 వేలు దాటితే బాదుడే
కొత్త నిబంధనల ప్రకారం.. ట్రావెల్ సంబంధిత లావాదేవీలపై ఎస్‌బీఐ 1 శాతం అదనపు సర్‌ఛార్జీ వసూలు చేయనుంది. టోల్ ఛార్జీలు, వివిధ రకాల ట్రావెల్ బుకింగ్స్ ఇందులోకి వస్తాయి. అయితే ఈ రూల్స్ మొత్తం నెలవారీ బిల్లుపై కాకుండా, ప్రతి ఒక్క లావాదేవీ ఆధారంగా వర్తిస్తుంది. అంటే మీరు ఒకే ట్రాన్సాక్షన్‌లో ట్రావెల్ కోసం రూ. 30 వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఆ మొత్తంపై 1 శాతం సర్‌ఛార్జీతో పాటు జీఎస్టీ, ఇతర పన్నులు అదనంగా కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ. 30 వేలు దాటిన ఖర్చుపై సుమారు రూ. 350 వరకు ఎక్స్‌ట్రా ఛార్జ్ పడుతుంది. అదే లావాదేవీ విలువ రూ. 30 వేల లోపు ఉంటే ఎలాంటి అదనపు ఛార్జీ ఉండదు.
పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై రూ. 50 వేల పరిమితి
పెట్రోల్, డీజిల్ కొనుగోళ్ల కోసం క్రెడిట్ కార్డు వాడేవారికి కూడా ఎస్‌బీఐ షాక్ ఇచ్చింది. ఫ్యూయెల్ విషయంలో ప్రతి లావాదేవీని కాకుండా, ఒక బిల్లింగ్ సైకిల్ (స్టేట్‌మెంట్) మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఒక బిల్లింగ్ సైకిల్‌లో మీరు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలపై రూ. 50 వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఆ మొత్తం మీద 1 శాతం సర్‌ఛార్జీ విధిస్తారు. ఉదాహరణకు ఒక నెల స్టేట్‌మెంట్‌లో ఫ్యూయెల్ ఖర్చు రూ. 60 వేలు దాటితే, రూ. 600 అదనపు రుసుముతో పాటు పన్నులు పడతాయి. మీ ఖర్చు రూ. 50 వేల లోపే ఉంటే ఎలాంటి సర్‌ఛార్జీ ఉండదు. ఈ నిబంధన 5172, 5542, 5541, 5983 అనే మర్చంట్ కేటగిరీ కోడ్‌ల (MCC) కింద జరిగే లావాదేవీలకు వర్తిస్తుంది.
అదనపు బాదుడు నుంచి ఇలా తప్పించుకోండి..
డిసెంబర్ 1 నుంచి ఈ ఎక్స్‌ట్రా ఛార్జీల బారిన పడకుండా ఉండాలంటే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులు ముందుగానే అలర్ట్ అవ్వాలి. ట్రావెల్, టోల్ పేమెంట్స్ చేసేటప్పుడు ఒకే లావాదేవీ రూ. 30 వేలు దాటకుండా చూసుకోవాలి. అలాగే మీ కార్డు బిల్లింగ్ సైకిల్ తేదీలను గమనిస్తూ, ఒక నెలలో ఫ్యూయెల్ ఖర్చు రూ. 50 వేల పరిమితి దాటకుండా ప్లాన్ చేసుకుంటే అదనపు ఛార్జీల నుంచి బయటపడవచ్చు.


