Bharat Summit: ప్రపంచవ్యాప్తంగా ఒకే ఆలోచనా ధోరణి కలిగిన వ్యక్తులను, ప్రభావశీలురను ఒకే వేదికపైకి తీసుకురావడానికి భారత్ సమ్మిట్ గొప్ప వేదిక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులను ఆహ్వానించామని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం వారిలో చాలామందికి వీసాలను రద్దు చేసిందన్నారు. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారు మనల్ని గమనిస్తున్నారని తాను నమ్ముతున్నానని రేవంత్ అన్నారు.
దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి నెహ్రూ దార్శనికత ఎంతో దోహదపడిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు శక్తుల మధ్య పోరాటం జరుగుతోందని.. ఒక శక్తి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంటే, మరో శక్తి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్-2026 ముగింపు సమావేశంలో డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అంశంపై సీఎం రేవంత్ మాట్లాడారు.
రాజ్యాంగం, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాం
మేము రాజ్యాంగం, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాము.. వారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, నియంతృత్వాన్ని రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పౌరుడికీ ఓటు హక్కు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ వారు తమకు నచ్చిన కొన్ని వర్గాలకే ఓటు హక్కు కల్పించాలని చూస్తున్నారని చెప్పారు. మేము పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. కానీ వారు పర్యావరణాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని బీజేపీపై ధ్వజమెత్తారు.
ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు
ముఖ్యంగా పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులతో సహా ప్రతి ఒక్కరినీ రక్షించాలని మేము కోరుకుంటున్నాం. కానీ వారు తమ సంపన్న మిత్రులను మాత్రమే కాపాడుకోవాలని చూస్తున్నారని చెప్పారు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ వారు కొద్దిమంది చేతుల్లోనే అధికారాన్ని కేంద్రీకరించాలని చూస్తున్నారని అన్నారు. మేము చర్చలు, సంప్రదింపులను కోరుకుంటున్నాం. కానీ వారు ఒకే వ్యక్తి నుంచి ఆదేశాలు రావాలని కోరుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. మమ్మల్ని ఆపగలమని వారు భావిస్తున్నారు. కానీ అది వారి భ్రమ మాత్రమే. మేము ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాడుతున్నంత కాలం ప్రపంచంలోని ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
''ప్రపంచీకరణ, కోవిడ్ తర్వాత అన్ని దేశాలు దాదాపు ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రాథమిక హక్కులపై దాడులు, విద్య, ఉపాధి, వైద్య సేవలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజల కలలు, ఆకాంక్షలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.
మనపై గొప్ప బాధ్యత ఉంది
లక్షలాది మంది ప్రజలు తమ ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని, వారి సమస్యలను వినాలని, వారి కలలను సాకారం చేయాలని మనపై ఆశలు పెట్టుకున్నారు. మనపై ఎంతో గొప్ప బాధ్యత ఉంది. మనమందరం కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తాం. మన నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించడం కోసం ఆయన పోరాడుతున్నారు. దళితులు, మైనారిటీలు, ఓబీసీలకు సామాజిక న్యాయం కల్పించడం కోసం ఆయన పోరాటం చేస్తున్నారు.
రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం
ఈ పోరాటంలో మనమందరం రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలి. ఆయన నాయకత్వంలో మనం ఈ మార్పును తీసుకువస్తాం. ప్రభుత్వం సంపన్నుల కోసం పనిచేయడం మానుకోవాలి. ప్రభుత్వాలు సామాన్య ప్రజల కోసం పనిచేయాలి. ప్రపంచవ్యాప్తంగా మనమందరం ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాం. అందరం కలిసి పోరాడుదాం. రాహుల్ నాయకత్వంలో ఈ ఆలోచనలతో మన దేశాన్ని కాపాడుకుందాం. 70 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తే, మనం కోరుకుంటున్న మార్పును తీసుకురాగలం. ఈ గొప్ప లక్ష్యం కోసం మనమందరం చేతులు కలిపి పోరాడుదాం'' అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


