TG: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు దేవస్థానం అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న 'చందనోత్సవం - మహా సంప్రోక్షణ' వేడుకల నేపథ్యంలో, ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఆరు రోజుల పాటు స్వామివారి మూలవిరాట్టు దర్శనం భక్తులకు అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు భక్తులు తమ యాత్రలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
బాలాలయంలో దర్శనాలు.. వాహన పూజలు, వీఐపీ బ్రేక్ రద్దు
చందనోత్సవం, మహా సంప్రోక్షణ వైదిక క్రతువుల దృష్ట్యా గర్భాలయంలోని మూలవిరాట్టు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా 'బాలాలయం' ఏర్పాటు చేసి, అక్కడ స్వామివారి దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. అంతేకాకుండా, ఈ ఆరు రోజుల పాటు ఆలయంలో జరిగే అన్ని రకాల ఆర్జిత సేవలు, కొత్త వాహనాలకు నిర్వహించే వాహన పూజలను పూర్తిగా నిలిపివేశారు. వీఐపీ దర్శనాలను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. ఈ సమయంలో ఎలాంటి రికమెండేషన్ లేఖలను పరిగణనలోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు.
21 నుంచి తిరిగి నిజరూప దర్శనం
చందనోత్సవ కార్యక్రమాలు ముగిసిన తర్వాత, ఈ నెల 21వ తేదీ నుంచి భక్తులకు యథావిధిగా స్వామివారి నిజరూప దర్శనం (మూలవిరాట్టు దర్శనం) కల్పించనున్నారు. అలాగే ఆరోజు నుంచే అన్ని ఆర్జిత సేవలు, వాహన పూజలు తిరిగి ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు. కాబట్టి ఈ నెల 20వ తేదీ వరకు కొండగట్టు వచ్చే భక్తులు ఆలయ నిబంధనలను గమనించి సహకరించాలని కోరారు.


