రాహుల్ గాంధీ ప్రసంగం మొత్తం మోదీని టార్గెట్ చేస్తూనే సాగిందా?
'యాంటీ భారత్ మీట్' అంటూ బీజేపీ ఎదురుదాడి
రూ.100 కోట్ల ఖర్చు, ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ ప్రశ్నలు
కాంగ్రెస్ కౌంటర్.. మూడు పార్టీల మధ్య ముదిరిన రాజకీయ పోరు
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ ఘనంగా జరిగింది. ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు, అంతర్జాతీయ అంశాలపై చర్చలు కూడా జరిగాయి. కానీ ఈ సదస్సు చుట్టూ కనిపించిన అసలైన వేడి మాత్రం రాజకీయాల్లోనే ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. చివరకు బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలన్నింటినీ కాంగ్రెస్ ఒక్కటే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒకవైపు బీజేపీ ఈ సదస్సును 'యాంటీ భారత్ మీట్' అని ముద్ర వేసింది. మరోవైపు బీఆర్ఎస్ జనం డబ్బు వృథా అవుతోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీసింది. కాంగ్రెస్ మాత్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయని గట్టిగా బదులిచ్చింది. ఇక రాహుల్ గాంధీ ప్రసంగం అంతర్జాతీయ విషయాల కంటే మన దేశ రాజకీయాల మీదే ఎక్కువగా సాగింది. మోదీ ప్రభుత్వం, ఎన్నికల వ్యవస్థ, అదానీ వ్యవహారాలపై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు.
యాంటీ భారత్ సమ్మిట్ అంటూ బీజేపీ విమర్శలు
భారత్ సమ్మిట్‌పై బీజేపీ మొదటి నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సుకు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను, విదేశీ సంస్థల ప్రతినిధులను పిలవడం ఏంటని ప్రశ్నించింది. బీజేపీ నేతలు దీనిని ఏకంగా 'యాంటీ భారత్ సమ్మిట్' అని పిలిచారు. విదేశీ శక్తుల సాయంతో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడానికే ఈ వేదికను వాడుకుంటున్నారని మండిపడ్డారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సమ్మిట్‌ను అడ్డుకోవాలని పిలుపునివ్వడంతో పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ సదస్సు ఖర్చులు, గతంలో పెట్టిన సమావేశాల వల్ల వచ్చిన ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంటే బీజేపీ విమర్శలు కేవలం సదస్సు నిర్వహణ మీదే కాదు.. రాహుల్ గాంధీ రాజకీయ లక్ష్యాల మీద కూడా ఉన్నాయని స్పష్టమవుతోంది.
ఆరు గ్యారెంటీలపై నిలదీసిన బీఆర్ఎస్
బీజేపీ దేశభక్తి, దేశ ప్రయోజనాల కోణంలో దాడి చేస్తే.. బీఆర్ఎస్ మాత్రం రాష్ట్ర సమస్యలతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్లాన్ వేసింది. దాదాపు రూ.100 కోట్ల జనం డబ్బుతో భారత్ సమ్మిట్ పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం రోడ్డెక్కినప్పుడు, లగచర్ల ఘటనలో గిరిజన మహిళలపై దాడులు జరిగినప్పుడు రాని రాహుల్ గాంధీ.. ఇప్పుడు ప్రచారం కోసం హైదరాబాద్‌కు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
మాజీ మంత్రి హరీష్ రావు మరో అడుగు ముందుకేశారు. రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు బడ్జెట్లలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో సమీక్షించాలని కోరారు. పేద కుటుంబాలు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. బడ్జెట్‌లో పథకాలు ప్రకటించడం తప్ప నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కౌంటర్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ఎదురుదాడి
బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ కూడా అంతే గట్టిగా సమాధానం ఇచ్చింది. భారత్ సమ్మిట్ రాజకీయ సభ కాదని, తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చూపించే వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మిట్‌కు వచ్చిన ప్రతినిధులు తెలంగాణలోని పరిశ్రమలు, సౌకర్యాలను స్వయంగా చూస్తారని.. భవిష్యత్తులో పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు రావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాయని విమర్శించారు.
అంతర్జాతీయ వేదికపై మోదీని టార్గెట్ చేసిన రాహుల్
ఇక భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ ప్రసంగం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆయన ప్రసంగంలో ప్రధానంగా వినిపించినవి దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ, బీజేపీ పాలనపై విమర్శలే. ప్రపంచ సమస్యలపై మాట్లాడాల్సిన వేదికపై కూడా ఆయన దేశ రాజకీయాలనే ప్రధానంగా ప్రస్తావించారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని రాహుల్ ఆరోపించారు. నియంతృత్వ పోకడలు పెరిగాయని, ప్రజాస్వామ్య సంస్థలపై ఒత్తిడి పెరుగుతోందని విమర్శించారు. ఎన్నికల వ్యవస్థ పారదర్శకతపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ఎన్నికలను ఉదాహరణగా చూపిస్తూ, మూడు నెలల గ్యాప్‌లోనే ఓటర్ల జాబితాలో 70 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని, వాళ్లంతా బీజేపీకే ఓటు వేశారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కోట్లాది మంది ఓటర్ల పేర్లు తొలగించారంటూ ఎన్నికల వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవన్నీ రాహుల్ చేసిన ఆరోపణలు.. వీటిపై ఎన్నికల సంఘం స్పందన, అసలు నిజాలు ఏంటనేది కూడా చూడాల్సి ఉంది.
అక్కడితో ఆగకుండా మోదీ, అదానీ మధ్య ఉన్న రాజకీయ, వ్యాపార సంబంధాలపై విమర్శలు చేశారు. దేశంలోని ముఖ్యమైన రంగాలన్నీ అదానీ చేతిలోకి వెళ్తున్నాయని, రాజకీయ అధికారానికి, బడా వ్యాపారాలకు మధ్య తేడా లేకుండా పోయిందని ఆరోపించారు.
మోదీని ఓడించి అధికారంలో నుంచి దించుతామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల పోరాటం నిజం, అహింస, ప్రేమ ఆధారంగా సాగుతుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో భారత్ సమ్మిట్ వేదిక పూర్తిగా బీజేపీ, మోదీ ప్రభుత్వంపై రాజకీయ దాడి చేసే వేదికగా మారిపోయింది.
వీసాల వివాదం.. మరో రాజకీయ అస్త్రం
సమ్మిట్‌కు పిలిచిన విదేశీ ప్రతినిధుల్లో కొందరికి వీసాలు నిరాకరించారని, మరికొందరి అనుమతులు రద్దు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సదస్సుకు రాలేకపోయిన విదేశీ అతిథులకు రాహుల్ గాంధీ క్షమాపణలు కూడా చెప్పారు.
అయితే వీసాల నిర్ణయాలు ఏ దేశానికైనా సొంత అధికార పరిధిలోకి వస్తాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. బీజేపీ కూడా దేశ భద్రత, వచ్చిన వాళ్ల నేపథ్యం లాంటి కారణాలు చూపిస్తూ కేంద్ర నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఈ వీసాల వివాదం కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్య మరో రాజకీయ అస్త్రంగా మారింది.
అయితే ఈ రాజకీయ యుద్ధంలో అసలైన ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఈ సమ్మిట్ వల్ల తెలంగాణకు నిజంగా ఎన్ని పెట్టుబడులు వస్తాయి? పెట్టిన ఖర్చుకు తగ్గ ఫలితం ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి? రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థపై చేసిన ఆరోపణలకు సమాధానాలు ఏంటి? ఇవన్నీ తేలాల్సిన విషయాలు. మొత్తానికి ప్రపంచ వేదికగా మొదలైన భారత్ సమ్మిట్.. తెలంగాణలో మూడు పార్టీల రాజకీయ కురుక్షేత్రంగా మారింది. కాంగ్రెస్‌కు ఇది అంతర్జాతీయ గుర్తింపు కోసం, బీజేపీకి జాతీయవాద రాజకీయాల కోసం, బీఆర్ఎస్‌కు రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఒక వేదికగా మారింది. అందుకే భారత్ సమ్మిట్ కాస్త.. పొలిటికల్ యుద్ధానికి కేంద్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.


