తెలంగాణ

హైదరాబాద్‌లో ఏందీ.. వన్‌వేల లొల్లి..? రోడ్లన్నీ వన్‌వే చేస్తే ట్రాఫిక్ తగ్గుతుందా?

14 నిమిషాల పఠనం

హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా వన్‌వే చర్చే. ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానం అమల్లోకి వచ్చింది. ఐటీ కారిడార్‌లో ఐకియా దగ్గర మరో వన్‌వే లూప్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పుడు లక్డీకాపూల్‌లోనూ వన్‌వే దిశగా ట్రాఫిక్ పోలీసులు అడుగులు వేస్తున్నారు.

ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం వన్‌వే ఒక్కటేనా?

ఒక రోడ్డుపై రద్దీ తగ్గించడానికి మరో రోడ్డుపై ఇబ్బందులు పెడతారా..?

ప్రయాణికులను ఇబ్బంది పెట్టడమే ట్రాఫిక్ మేనేజ్‌మెంటా..?

హైదరాబాద్ లో ఏంటీ వన్ వే లొల్లి..?

హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా వన్‌వే చర్చే. ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానం అమల్లోకి వచ్చింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులు కొత్త రూట్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐటీ కారిడార్‌లో ఐకియా దగ్గర మరో వన్‌వే లూప్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పుడు లక్డీకాపూల్‌లోనూ వన్‌వే దిశగా ట్రాఫిక్ పోలీసులు అడుగులు వేస్తున్నారు.

అసలు హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది? ట్రాఫిక్ తగ్గించాల్సిన అధికారులు కొత్త కొత్త రూట్లు ఎందుకు సృష్టిస్తున్నారు? సామాన్య ప్రయాణికుడి ఇబ్బందులను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు?

కేబీఆర్ పార్క్ దగ్గర మొదలైన ప్రయోగం.. జూబ్లీహిల్స్‌లో ప్రయాణ కష్టాలు!

హైదరాబాద్‌లో వన్‌వే ప్రయోగానికి ప్రధాన ఉదాహరణ కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతం. H-CITI ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల కారణంగా రోడ్లపై అందుబాటులో ఉన్న స్థలం తగ్గింది. దీంతో 2026 ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానం అమల్లోకి తెచ్చారు.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45, ఎన్‌టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, క్యాన్సర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలను కలుపుతూ దాదాపు 5.9 కిలోమీటర్ల లూప్‌లో వాహనాల రాకపోకలను మళ్లించారు.

అయితే ఈ మార్పుతో ప్రయాణికులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. గతంలో తక్కువ దూరంలో చేరుకునే ప్రాంతాలకు ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొత్త రూట్లపై అవగాహన లేకపోవడం, లేన్ మార్పులు, ప్రత్యామ్నాయ రోడ్లపై ఒత్తిడి వాహనదారులకు ఇబ్బందులు కలిగించాయి.

ఒక ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గించడానికి మరో ప్రాంతంలో ప్రయాణ దూరం పెంచితే అది ఎలా పరిష్కారం అవుతుంది? ఒక జంక్షన్‌లో రద్దీ తగ్గిందని చెప్పడం కాదు.. ప్రయాణికుడి గమ్యస్థానానికి చేరుకునే సమయం తగ్గిందా లేదా అన్నది ముఖ్యం కాదా?

ఐకియా దగ్గర మరో ప్రయోగం.. ఐటీ ఉద్యోగులకు కొత్త తిప్పలు!

ఇప్పుడు ఐటీ కారిడార్‌లోనూ ఇదే తరహా ప్రయోగానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా రోటరీ, రహేజా మైండ్‌స్పేస్, నాలెడ్జ్ సిటీ, డల్లాస్ సెంటర్, మై హోమ్ భూజా మీదుగా తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునేలా వన్‌వే లూప్ ప్రతిపాదించారు. ఈ మార్గంలో వాహనాలను ఒకే దిశలో నడిపించడం ద్వారా కీలకమైన నాలుగు జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించాలన్నది అధికారుల ఆలోచన.

అయితే ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ట్రాఫిక్ సిమ్యులేషన్ పరీక్షలు, ఐటీ కంపెనీలు, వ్యాపార సంస్థలతో చర్చల తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లోనే ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు వన్‌వే లూప్ అమల్లోకి వస్తే క్యాబ్‌లు, కంపెనీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, స్థానిక నివాసితుల రాకపోకల పరిస్థితి ఏమిటి?

ఒక జంక్షన్ దగ్గర ట్రాఫిక్ తగ్గితే మరో జంక్షన్ దగ్గర పెరగదని గ్యారెంటీ ఏమిటి? ఈ మార్పుల వల్ల ప్రయాణ సమయం ఎంత తగ్గుతుందో, ప్రయాణ దూరం ఎంత పెరుగుతుందో అధికారులు ముందుగానే ప్రజలకు చెప్పగలరా?

ఇప్పుడు లక్డీకాపూల్ వంతు.. మూడు కీలక మార్గాల్లో మార్పులు!

ఇప్పుడు తాజాగా లక్డీకాపూల్ పరిసర ప్రాంతంపై ట్రాఫిక్ పోలీసుల దృష్టి పడింది. నవంబర్ 6న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ స్వయంగా బైక్‌పై పర్యటించి ప్రతిపాదిత మార్గాలను పరిశీలించారు.

ద్వారకా హోటల్, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్ క్రాస్‌రోడ్స్, ఓల్డ్ కంట్రోల్ రూమ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించారు.

ఓల్డ్ కంట్రోల్ రూమ్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్, సచివాలయం జంక్షన్ మీదుగా మళ్లించే ప్రతిపాదన ఉంది.

నిరంకారి జంక్షన్ నుంచి ఓల్డ్ కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలను పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి మీదుగా పంపేలా మరో మార్గాన్ని పరిశీలిస్తున్నారు.

అలాగే సచివాలయం, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ఓల్డ్ కంట్రోల్ రూమ్ మీదుగా యూ టర్న్ తీసుకుని అసెంబ్లీ గేట్ నంబర్ 3, హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్ వైపు మళ్లించే ప్రతిపాదన కూడా ఉంది.

అయితే ఈ మార్పులు ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. సంబంధిత శాఖలతో సమన్వయం, అవసరమైన అనుమతుల తర్వాత ప్రయోగాత్మకంగా అమలు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

లక్డీకాపూల్‌లో ట్రాఫిక్ సమస్య ఉందనేది నిజమే. కానీ దానికి పరిష్కారంగా వాహనాలను మరింత దూరం తిప్పడమే మార్గమా? ఇప్పటికే రద్దీగా ఉండే సైఫాబాద్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి ప్రాంతాలపై అదనపు భారం పడితే పరిస్థితి ఏమిటి?

ట్రాఫిక్ తగ్గించడానికి వన్‌వే ఒక్కటే మార్గమా?

ఇక్కడే ప్రభుత్వాన్ని, ట్రాఫిక్ పోలీసులను కొన్ని ప్రశ్నలు అడగాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు కారణం కేవలం వాహనాల సంఖ్య మాత్రమే కాదు. రోడ్ల ఆక్రమణలు, రోడ్డుపైనే పార్కింగ్, జంక్షన్ల డిజైన్‌లో లోపాలు, సిగ్నళ్ల నిర్వహణ, నిర్మాణ పనుల వల్ల రోడ్లు కుంచించుకుపోవడం.. ఇవన్నీ ట్రాఫిక్ సమస్యను పెంచుతున్నాయి. మరి వీటిని పరిష్కరించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు?

మెయిన్ రోడ్డు పక్కనే వాహనాలను పార్కింగ్ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవుతుంటే పట్టించుకునే వారెవరు? జంక్షన్ల దగ్గర సిగ్నల్ టైమింగ్‌ను శాస్త్రీయంగా మార్చే ప్రయత్నాలు ఎక్కడివరకు వచ్చాయి?

మెట్రో, ఆర్టీసీ బస్సులను మరింత అందుబాటులోకి తీసుకొస్తే వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుతుంది. చివరి కనెక్టివిటీని మెరుగుపరిస్తే వేలాది మంది సొంత వాహనాలతో రోడ్లపైకి రావాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించకుండా రోడ్ల దిశలను మార్చడం వల్ల ఎంతకాలం ట్రాఫిక్ సమస్యను నియంత్రించగలరు?

ప్రజల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయాలా?

ట్రాఫిక్ పోలీసులు తీసుకునే నిర్ణయాల వెనుక ఉద్దేశం మంచిదే కావచ్చు. ట్రాఫిక్ తగ్గించాలి. ప్రయాణ సమయం ఆదా చేయాలి. ప్రమాదాలను నివారించాలి. కానీ ఆ నిర్ణయాల వల్ల ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా!

ఒక ప్రాంతంలో వన్‌వే అమలు చేయాలనుకుంటే ముందుగా స్థానిక ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు, క్యాబ్ ఆపరేటర్లు, రోజూ ఆ మార్గంలో ప్రయాణించే వారి అభిప్రాయాలు తీసుకోవాలి. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణ సమయం ఎంత తగ్గింది? ప్రయాణ దూరం ఎంత పెరిగింది? ప్రత్యామ్నాయ రోడ్లపై రద్దీ ఎంత పెరిగింది? అత్యవసర వాహనాలకు ఎంత సౌలభ్యం కలిగింది? ఈ వివరాలను ప్రజల ముందుంచాలి.

కేవలం ఒక జంక్షన్ దగ్గర వాహనాలు వేగంగా వెళ్లడమే విజయానికి కొలమానం కాదు. మొత్తం రూట్‌లో ప్రయాణికుడి సమయం ఆదా అవుతుందా లేదా అన్నదే అసలు పరీక్ష కావాలి.

ప్రభుత్వానికి, పోలీసులకు సూటి ప్రశ్నలు!

కేబీఆర్ పార్క్ వన్‌వే వల్ల మొత్తం ప్రయాణ సమయం ఎంత తగ్గింది? ప్రయాణికుల ప్రయాణ దూరం ఎంత పెరిగింది? ఐకియా పరిసరాల్లో ప్రతిపాదిస్తున్న వన్‌వే లూప్‌కు సంబంధించిన ట్రాఫిక్ సిమ్యులేషన్ ఫలితాలను ప్రజలకు వెల్లడిస్తారా? లక్డీకాపూల్‌లో కొత్త మార్గాలు అమలు చేస్తే ప్రత్యామ్నాయ రోడ్లపై ఏర్పడే రద్దీని ఎలా నియంత్రిస్తారు?

కొత్త వన్‌వే విధానాల వల్ల అంబులెన్స్‌లు, అత్యవసర సేవల వాహనాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రతి కొత్త ట్రాఫిక్ విధానం అమలుకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేపట్టడం లేదు..? వన్‌వే ప్రయోగం విఫలమైతే తిరిగి పాత విధానానికి వెళ్లే అవకాశం ఉంటుందా? ఇవి కేవలం ప్రశ్నలు కావు. ప్రతిరోజూ హైదరాబాద్ రోడ్లపై ప్రయాణిస్తున్న లక్షలాది మంది ఎదుర్కొంటున్న సమస్యలు.

నగరం ప్రజల కోసం.. ప్రయోగాల కోసం కాదు!

హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చాలన్న లక్ష్యం మంచిదే. ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను కూడా తక్కువ చేయలేం. కానీ ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన నిర్ణయాలే కొత్త ప్రయాణ కష్టాలకు కారణం కాకూడదు.

ఒక రోడ్డుపై ట్రాఫిక్ తగ్గించి మరో రోడ్డుపై పెంచడం పరిష్కారం కాదు. ప్రయాణికుడి సమయం ఆదా కావాలి. ఫ్యూయల్ ఆదా కావాలి. గమ్యస్థానానికి చేరుకోవడానికి చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు. హైదరాబాద్ రోడ్లపై ప్రజలు ప్రయాణించాలి కానీ ట్రాఫిక్ ప్రయోగాలకు బలికాకూడదు.

వన్‌వేలు పెంచడం కాదు.. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. పోలీసుల దగ్గర ప్లాన్ ఉండాలి. ప్రభుత్వ దగ్గర మౌలిక సదుపాయాలపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలి. అందుకే.. హైదరాబాద్ ప్రజలకు కావాల్సింది కొత్త వన్‌వేలు కాదు.. సాఫీగా సాగిపోయే ప్రయాణం. మరి ఇందుకోసం ప్రభుత్వం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా..? లేక వన్ వే.. లతో జనానికి చుక్కలు చూపడమే లక్ష్యమా..?

#Hyderabad Traffic#Hyderabad One Way Roads#Lakdikapul Traffic#Jubilee Hills Traffic#IKEA Hyderabad#Hyderabad Traffic Police#Hyderabad Road Traffic#Traffic Diversions#One Way Traffic#Hyderabad News#Telangana News#Traffic Problems#KBR Park Traffic#Cyberabad Traffic#Hyderabad Commuters#GHMC#Hyderabad Road Planning#Traffic Management
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి