PF Withdrawal: ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాల్లో మిగిలిపోయిన చిన్న చిన్న మొత్తాలను క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోయారా? అలాంటి ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి క్లెయిమ్ ఫారాలు అప్లికేషన్స్‌తో పని లేకుండానే.. పాత అకౌంట్లలో మూలుగుతున్న సొమ్మును నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేసే సరికొత్త ‘ఆటో సెటిల్మెంట్’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఎలాంటి అప్లికేషన్ అక్కర్లేదు.. ఆటోమేటిక్‌గా ఖాతాలోకి
సాధారణంగా ఉద్యోగం మారినప్పుడు పాత ఖాతాలోని సొమ్మును కొత్త ఖాతాలోకి మార్చుకోవాలి లేదా విత్‌డ్రా చేసుకోవాలి. అయితే వందల రూపాయలు, వెయ్యి రూపాయలే కదా అని చాలామంది లైట్ తీసుకుంటారు. అలా మూడేళ్లపాటు ఎలాంటి లావాదేవీలు లేకపోతే ఆ ఖాతాలు ఇనాక్టివ్ మారిపోతాయి. రూల్స్ ప్రకారం ఇనాక్టివ్ అయిన ఖాతా నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవడం చాలా ప్రయాసతో కూడుకున్న పని. ఈ సమస్యకు చెక్ పెడుతూ, ఇనాక్టివ్ ఖాతాల్లో రూ.1,000 లేదా అంతకంటే తక్కువ నగదు ఉన్నవారికి ఈపీఎఫ్‌వో నేరుగా ఉపశమనం కల్పిస్తోంది. ఉద్యోగులు అప్లై చేయక్కర్లేకుండానే, పీఎఫ్ రికార్డుల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్‌కు ఆ సొమ్మును ఆటోమేటిక్‌గా బదిలీ చేస్తోంది.
లక్ష మందికి లబ్ధి.. రూ.5 కోట్ల చెల్లింపులు
ఖాతాదారుడి బ్యాంక్ వివరాలు, కేవైసీ సమాచారాన్ని సరిచూసుకున్న తర్వాతే ఈ ఆటో సెటిల్మెంట్ జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు ఒక లక్ష ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాల్లోని రూ.5 కోట్ల మేర నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే రూ.1,000 అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు మాత్రమే ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్నవారు మాత్రం రూల్స్ ప్రకారం ఆన్‌లైన్‌లో క్లెయిమ్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం వదిలేసిన తర్వాత వరుసగా మూడేళ్ల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోతే ఆ ఖాతా ఇనాక్టివ్ అవుతుందన్న విషయాన్ని ఉద్యోగులు గమనించాలి.


