క్రైమ్

56 వేల కోట్ల క్రిప్టో చోరీ.. ఉత్తర కొరియా హ్యాకర్ల పనేనా?

రచన: Kashi••10 నిమిషాల పఠనం

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ దొంగతనాల్లో ఒకటి ఇది. కేవలం 20 నిమిషాల్లో 6.36 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ ఆస్తులు మాయం చేశారు. దీని వెనుక ఉత్తర కొరియా హ్యాకింగ్ గ్రూప్ ట్రేడర్‌ట్రెయిటర్ ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎవరీ హ్యాకర్లు? ఎలా దాడి చేశారు?

బినాన్స్‌పై భారీ సైబర్ దాడి..

రూ.56 వేల కోట్ల క్రిప్టో చోరీ!

20 నిమిషాల్లో వేల కోట్లు మాయం!

ఉత్తర కొరియా హ్యాకర్లపై అనుమానాలు

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ దొంగతనాల్లో ఒకటి ఇది. కేవలం 20 నిమిషాల్లో 6.36 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ ఆస్తులు మాయం చేశారు. దీని వెనుక ఉత్తర కొరియా హ్యాకింగ్ గ్రూప్ ట్రేడర్‌ట్రెయిటర్ ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎవరీ హ్యాకర్లు? ఎలా దాడి చేశారు?

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ బినాన్స్‌పై భారీ సైబర్ దాడి జరిగింది. దాదాపు 6.36 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అంటే భారత కరెన్సీలో సుమారు 56 వేల కోట్ల రూపాయలకు పైమాటే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ దాడిలో ఎక్కువ మొత్తాన్ని కేవలం 20 నిమిషాల్లోనే తరలించారు. బినాన్స్ అంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి. బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను కొనుగోలు, అమ్మకాలు చేస్తుంటుంది ఈ సంస్థ.

ఈ దాడి వెనుక ఉత్తర కొరియాకు చెందిన ట్రేడర్‌ట్రెయిటర్ అనే హ్యాకింగ్ గ్రూప్ ఉందని రెండు ప్రముఖ బ్లాక్‌చైన్ విశ్లేషణ సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇది నిజమైతే క్రిప్టో కరెన్సీ చరిత్రలోనే అతిపెద్ద దొంగతనంగా నిలిచిపోతుంది.

ఎవరీ ట్రేడర్‌ట్రెయిటర్?

ట్రేడర్‌ట్రెయిటర్ అనేది ఉత్తర కొరియాతో సంబంధాలున్న హ్యాకింగ్ గ్రూప్. ఇది అంతర్జాతీయంగా పేరున్న లాజరస్ గ్రూప్‌లో భాగంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లు, డిజిటల్ ఆస్తుల సంస్థలే వీరి ప్రధాన టార్గెట్.

అమెరికా ఎఫ్‌బీఐ, సైబర్ సెక్యూరిటీ సంస్థలు కూడా ట్రేడర్‌ట్రెయిటర్ పేరుతో ఈ గ్రూప్ కార్యకలాపాలను గుర్తించాయి. క్రిప్టో సంస్థల్లోని భద్రతా లోపాలను ఉపయోగించుకోవడం, ఉద్యోగులను మోసం చేసి కీలక సమాచారాన్ని సంపాదించడం, డిజిటల్ వాలెట్లను నియంత్రణలోకి తీసుకోవడం వంటి పద్ధతులతో దాడులు చేస్తుంటారని అమెరికా అధికారులు చెబుతున్నారు.

ఉత్తర కొరియా అంతర్జాతీయ ఆంక్షల మధ్య తన ఆయుధ కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకోవడానికి సైబర్ దాడులను ఉపయోగిస్తోందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. అందులో భాగంగానే క్రిప్టో కరెన్సీ సంస్థలను టార్గెట్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

20 నిమిషాల్లో 6.36 బిలియన్ డాలర్లు ఎలా మాయమయ్యాయి?

అక్టోబర్ 29న బినాన్స్‌కు చెందిన పలు డిజిటల్ వాలెట్ల నుంచి అనుమానాస్పదంగా క్రిప్టో ఆస్తులు బయటకు వెళ్లడం మొదలైంది. మొత్తం 10 బ్లాక్‌చైన్ నెట్‌వర్క్‌లలోని వాలెట్ల నుంచి సొమ్ము తరలిపోయింది. బిట్‌కాయిన్, ఎథీరియం, సోలానా, ట్రాన్ సహా పలు నెట్‌వర్క్‌లలో ఈ లావాదేవీలు జరిగాయి.

ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. క్రిప్టో కరెన్సీని నిల్వ చేయడానికి డిజిటల్ వాలెట్లు ఉపయోగిస్తారు. వాటిలో ఇంటర్నెట్‌కు అనుసంధానమై ఉండే వాలెట్లను హాట్ వాలెట్లు అంటారు. కస్టమర్ల లావాదేవీలు వేగంగా నిర్వహించడానికి ఎక్స్ఛేంజ్‌లు వీటిని ఉపయోగిస్తాయి. ఈ వాలెట్లను నియంత్రించే వ్యవస్థలోకి హ్యాకర్లు చొరబడి, తమకు అనుకూలంగా లావాదేవీలు జరిగేలా చేశారన్నది ప్రాథమిక అంచనా.

దాడికి కనీసం 36 గంటల ముందే హ్యాకర్లు సన్నాహాలు ప్రారంభించారట. చిన్న చిన్న లావాదేవీలతో పరీక్షలు నిర్వహించి, సరైన సమయం చూసి భారీ మొత్తాలను తరలించారని తెలుస్తోంది.

బినాన్స్‌కు ఇది మొదటిసారి కాదు!

ఈ దాడి ఒక్కసారిగా క్రిప్టో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే 2025 ఫిబ్రవరిలో దుబాయ్‌కు చెందిన బైబిట్ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌పైనా భారీ దాడి జరిగింది. అప్పట్లో దాదాపు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఎథీరియం టోకెన్లను హ్యాకర్లు దొంగిలించారు. ఆ దాడి వెనుక కూడా ఉత్తర కొరియా లాజరస్ గ్రూప్ ఉందని ఎఫ్‌బీఐ ఆరోపించింది. ట్రేడర్‌ట్రెయిటర్ కార్యకలాపాలతోనూ సంబంధాలున్నాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పుడు బినాన్స్‌పై జరిగిన దాడి ఆ మొత్తానికి నాలుగు రెట్లకుపైగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

సొమ్ములో కొంత ఫ్రీజ్.. మిగతాది హ్యాకర్ల చేతుల్లోనే!

దాడి జరిగిన తర్వాత క్రిప్టో సంస్థలు అప్రమత్తమయ్యాయి. టెథర్, సర్కిల్ వంటి సంస్థలు తమ నియంత్రణలో ఉన్న కొన్ని స్టేబుల్‌కాయిన్‌లను ఫ్రీజ్ చేశాయి. అర్బిట్రమ్ నెట్‌వర్క్ కూడా కొన్ని ఆస్తులను హ్యాకర్లు ఉపయోగించకుండా అడ్డుకుంది. మొత్తం మీద దాదాపు 2.7 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు టీఆర్‌ఎం ల్యాబ్స్ అంచనా.

అయితే మిగిలిన సొమ్ములో కొంత భాగాన్ని హ్యాకర్లు ఎథీరియం, బిట్‌కాయిన్ వంటి ఆస్తులుగా మార్చినట్లు గుర్తించారు. వీటిని తిరిగి పట్టుకోవడం అంత సులభం కాదు.

మరోవైపు బినాన్స్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల నష్టాలను తమ సంస్థ నిధులతో భర్తీ చేస్తామని తెలిపింది. నెట్‌వర్క్‌లలో కొన్ని డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది.

సోనీ దాడి నుంచి క్రిప్టో దొంగతనాల వరకు!

ఉత్తర కొరియా హ్యాకర్లపై ఆరోపణలు క్రిప్టో ప్రపంచానికే పరిమితం కావు. 2014లో సోనీ పిక్చర్స్ కంప్యూటర్ వ్యవస్థలపై జరిగిన సైబర్ దాడి వెనుక కూడా ఉత్తర కొరియా హ్యాకర్లు ఉన్నారని అమెరికా ఆరోపించింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌ను వ్యంగ్యంగా చూపించిన 'ది ఇంటర్వ్యూ' సినిమా విడుదలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందన్నది అప్పటి ఆరోపణ. ఆ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా పలు సైబర్ దాడుల్లో ఉత్తర కొరియా సంబంధిత హ్యాకింగ్ గ్రూపుల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు బినాన్స్‌పై జరిగిన దాడి మరోసారి ప్రపంచానికి ఒక హెచ్చరిక. డిజిటల్ కరెన్సీ ఎంత వేగంగా పెరుగుతోందో, దాన్ని దొంగిలించే సైబర్ నేరగాళ్ల సామర్థ్యం కూడా అంతే వేగంగా పెరుగుతోంది. బ్యాంకులో డబ్బు దాచుకున్నంత మాత్రాన భద్రత ఉన్నట్లు కాదు. డిజిటల్ వాలెట్లలో ఉన్న ఆస్తులకూ పటిష్టమైన రక్షణ అవసరం. క్రిప్టో ప్రపంచం ముందు ఇప్పుడు ఉన్న అతిపెద్ద ప్రశ్న ఇదే. డిజిటల్ సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో, దాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం.

#Crypto Heist#Binance Hack#North Korea Hackers#TraderTraitor#Lazarus Group#Cryptocurrency#Crypto News#Bitcoin#Ethereum#Tether#Blockchain Security#Cyber Attack#Crypto Theft#Digital Currency#Cyber Crime#Cryptocurrency News#Binance#Global Cybersecurity
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి