TG: తెలంగాణ పోలీస్ శాఖలో ప్రభుత్వం అనూహ్యంగా భారీ ప్రక్షాళన చేపట్టింది. ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ బదిలీల జాబితాలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్‌ను అక్కడి నుంచి తప్పించి, అగ్నిమాపక శాఖ (ఫైర్ సర్వీసెస్) డీజీగా బదిలీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సజ్జనార్ స్థానంలో డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్న మహేశ్ మురళీధర్ భగవత్‌ను హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.
సజ్జనార్ బదిలీపై చర్చ.. కొత్త బాధ్యతలు ఇవే!
1996 బ్యాచ్‌కు చెందిన వీసీ సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీ బాధ్యతల నుంచి తెలంగాణ ఫైర్ సర్వీసెస్, విపత్తుల నిర్వహణ, అత్యవసర సేవలు, పౌర రక్షణ విభాగాల డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది. దీనితో పాటు ఆయనకు ఎస్పీఎఫ్ (SPF) డీజీ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించింది. కీలకమైన కమిషనరేట్ బాధ్యతల నుంచి సజ్జనార్‌ను అగ్నిమాపక శాఖకు పంపడం అధికార వర్గాల్లో, సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇక 1995 బ్యాచ్‌కు చెందిన మహేశ్ భగవత్ హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
కీలక విభాగాల్లో సమూల మార్పులు..
డీజీపీ స్థాయి నుంచి డీసీపీ స్థాయి వరకు ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. జైళ్ల శాఖ డీజీపీగా ఉన్న డాక్టర్ సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్)ను మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీపీగా బదిలీ చేశారు. ఆమెకు ఆర్గనైజేషన్, లీగల్ విభాగాల అదనపు బాధ్యతలు ఇచ్చారు. స్వాతి లఖ్రా (1995 బ్యాచ్) జైళ్ల శాఖ డీజీపీగా నియమితులయ్యారు. అలాగే ఆమె హోంగార్డ్స్ విభాగాన్ని కూడా అదనంగా పర్యవేక్షిస్తారు. ఏసీబీ పూర్తి స్థాయి డీజీపీగా చారు సిన్హా (1996 బ్యాచ్) నియమితులయ్యారు. సీఐడీ డీజీపీగా ఆమె అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు. గ్రేహౌండ్స్ డీజీపీగా ఉన్న డాక్టర్ అనిల్ కుమార్ (1996 బ్యాచ్)ను తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నియమించారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న వై. నాగిరెడ్డి (1997 బ్యాచ్)ని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న విక్రమ్ సింగ్ మాన్ (1998 బ్యాచ్) గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీపీగా నియమితులయ్యారు. అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా అకున్ సబర్వాల్ (2001 బ్యాచ్)కు బాధ్యతలు అప్పగించారు. పౌరసరఫరాల శాఖ నుంచి ఎం. స్టీఫెన్ రవీంద్ర (1999 బ్యాచ్)ను బదిలీ చేసి తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (టీజీ-టీమార్స్) డైరెక్టర్‌గా నియమించారు.
ఐజీ, డీఐజీ స్థాయిలో జరిగిన ప్రధాన బదిలీలు ఇవే..
ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (2004 బ్యాచ్) మల్టీ జోన్-1 ఐజీ నుంచి ఏసీబీ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. కార్తికేయ (2006 బ్యాచ్) ఇంటెలిజెన్స్ ఐజీ నుంచి మల్టీ జోన్-1 ఐజీగా బదిలీ (ఐసీసీసీ డైరెక్టర్ అదనపు బాధ్యతలు), కె. రమేష్ నాయుడు (2006 బ్యాచ్) రైల్వేస్ ఐజీగా నియామకం, డి. జోయల్ డేవిస్ (2010 బ్యాచ్) రోడ్డు భద్రత, ట్రాఫిక్ (టీజీ-టీమార్స్) జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ (హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు), ఎల్.ఎస్. చౌహాన్ (2009 బ్యాచ్) డీఐజీ కోఆర్డినేషన్‌గా నియామకం (చార్మినార్ జోన్-6 డీఐజీ అదనపు బాధ్యతలు), కె. నారాయణ నాయక్ (2009 బ్యాచ్) సీఐడీ డీఐజీగా ఉంటూనే బాసర జోన్-2 డీఐజీగా అదనపు బాధ్యతలు, జి.చందన దీప్తి (2012 బ్యాచ్) ఫ్యూచర్ సిటీ జాయింట్ సీపీగా కొనసాగుతూ జోగులాంబ జోన్-7 డీఐజీగా అదనపు బాధ్యతలు, ఆర్. భాస్కరన్ (2012 బ్యాచ్) సీఐ సెల్ డీఐజీతో పాటు ఇంటెలిజెన్స్ డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న శ్రీ బాలాదేవిని టీజీ-టీమార్స్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్)గా, వి. అరవిందబాబును హైదరాబాద్ డీసీపీ (ఎస్ఎం అండ్ ఐటీ)గా నియమించారు. అలాగే టీజీఎస్పీ ఏడీజీపీగా ఉన్న సంజయ్ కుమార్ జైన్ (1997 బ్యాచ్)కు ఏడీజీపీ శిక్షణ బాధ్యతలను ప్రభుత్వం అదనంగా అప్పగించింది.


