స్కీంలో స్కాం అయినా.. టెండర్స్‌ని థండర్‌గా కొట్టేయాలన్నా?
ఆనాడు వందల కోట్లలో వాటా.. ఈనాడు రూ.10 కోట్లు దాటకపోయినా చేతివాటం?
నేతల వీక్‌నెస్‌తో చక్రం తిప్పుతున్న బ్యూరో క్రాట్స్ పెరిగిపోయారా?
అనుకున్న వాళ్లకు అప్పగించేయడమే పని?
తప్పుదారి పట్టించడంలోనూ దిట్టగా మారిన వైనం?
దాచుకునే వాళ్లకు దోచుకునేంతగా వ్యవహారం నడిపిస్తున్నారు?
ప్రభుత్వ పెద్దల అత్యాశతో స్ట్రీమ్ లేని వ్యవస్థ
ఫీల్డ్ వెరిఫికేషన్ పేరుతో పూటకో నేత పేరు చెప్పి దందాలు?
మాట దాటివేతలతో తప్పించుకుంటున్న అధికారుల వ్యవహారంపై స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్
డబ్బు ఆశతో వ్యవస్థ ఖూనీ?
బీఆర్ఎస్ రెండో టర్మ్‌లో 10 మంది టాప్ వెలమ దొరలు చెప్పిందే వేదం. అందులో రూ.100 కోట్ల టెండర్ దాటితేనే లాబీయిస్టులు ఎంట్రీ అయ్యేవారు. చెరువుల పూడిక నుంచి భగీరథ, కాళేశ్వరం వరకు ఒక మాదిరిగా జరిగింది. రెండో టర్మ్‌లో ధరణి, బడా స్కీంలో స్కాంలు ఎలా చేయాలో నేతల డైరెక్షన్స్‌లో జరిగేవి. కాంగ్రెస్ సర్కార్‌లో అలా కాదు. అధికారులు ఏది అనుకుంటే అలానే జరుగుతోంది. ఏనాడు ఏ నాయకుడిది వాళ్ల అనుచరులది నడుస్తుందో తెలియని పరిస్థితుల్లో అధికారులు రోజుకో నేత పేరును చెప్పుకుని సంపాదించుకుంటున్నారు. అందుకు అనేక ఆధారాలు స్వేచ్ఛ న్యూస్ వద్ద ఉన్నాయి. మచ్చుకగా కొన్ని చూద్దాం.
కొత్త కొత్త రూల్స్
గతంలో మేఘా, నవయుగ, బీ శీనయ్య, కేఎల్ఆర్ లాంటి సంస్థలకే పెద్ద పెద్ద కాంట్రాక్టులు దక్కేవి. వాళ్లే బల్క్‌గా డబ్బులు రాజకీయ పార్టీలకు ఫండ్స్ రూపంలో ఇచ్చేవారు. అధికారిక ఖర్చులు చెప్పాలని ఎలక్షన్ బాండ్స్ వచ్చాయి. అంతే స్పీడ్‌గా కాలం మారింది. ఇప్పడు అంతా ఆన్ లైన్ అయిపోవడంతో కొర్రీలు వెతకడం అధికారులకు అలవాటు అయింది. ఇప్పుడు అంతా వాళ్లు అనుకున్న వాళ్లకు ఇచ్చే పరిస్థితి వస్తోంది. గతంలో లాగానే రూ.100 కోట్ల దాటకుండానే కాకుండా ఇప్పుడు 20 కోట్లు దాటితే చాలు ఫర్సంటేజీ పేరుతో రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉండే పెద్దలు అడుగుతున్నారు. కానీ, 20 కోట్ల లోపు ఉండే టెండర్స్ అన్నింటిని అధికారులే చక్రం తిప్పుతున్నారు.
సింగరేణిలో స్టార్ట్ చేశారు
సింగరేణి టెండర్స్‌లో అనుకున్న వారికి దక్కేందుకు ఫిల్డ్ వెరిఫికేషన్ అంటూ కొత్త నిబంధనలు పెట్టారు. దీంతో టెండర్స్‌లో పాల్గొన్న వారిలో ఒక్కరికే.. ఫీల్డ్‌లో వాళ్లు గతంలో పని చేశారా? అక్కడ వాళ్లు అనుకూలమైన పనులు చేసుకున్నారా లేదా అంటూ నివేదిక ఇస్తుంటారు. టెండర్స్‌లో పాల్గొన్న మిగితా వాళ్లకు అర్హత ఉన్నా, వాళ్లకు వీళ్లు అనుకున్నవి అన్ని చూపించినా ఫీల్డ్‌లోకి రారు? వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఇలా మొత్తం టెండర్స్ కొట్టేస్తున్నారు.
టీజీఐఐసీలో మితిమీరి పోతున్నాయి
అధికారులు బయటకు కనిపించేంతగా సాఫ్ట్ గా ఉండరు. అందుకు నిదర్శనం టీజీఐఐసీలోని కొంతమంది పెద్ద అధికారులు ఏ మంత్రి వద్ద ఏ ముచ్చట చెప్పాలో చెబుతున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. వీటికి అనేక ఆధారాలు స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి వద్దకు వచ్చాయి.
సైబరాబాద్ కమిషనరేట్‌లో బడా స్కెచ్?
ఇటీవల కాలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో యూజర్ ఛార్జీల నిధులు విచ్చలవిడిగా పక్కదారి పట్టాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజల నుంచి వసూలు చేసిన యూజర్ ఛార్జీల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారంటూ స్వేచ్ఛ న్యూస్ తన ప్రధాన పేజీలో సంచలనాత్మక వార్తా కథనాన్ని ప్రచురించింది. బాధ్యతాయుతమైన విభాగంలో దాదాపు రూ. 2.76 కోట్ల రూపాయలను అత్యంత అనుమానాస్పదంగా విత్ డ్రా చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు విత్‌డ్రా చేసిన అమౌంట్ ఒకే చిరునామాలో రిజిస్టర్ అయిన ఫర్మ్‌ల ఖాతాల్లోకే జమ కావడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ క్రమంలో ఆ యజమానులు ఎవరు? ఎందుకు ముందే వాటికి కేటాయించారు? అనేవి ప్రశ్నలుగా ఉన్నాయి. అయితే, బిగ్ స్కెచ్ గీసింది టీజీఐఐసీ నుంచే అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక నేరుగా సీపీ ఉపయోగించుకునే అకౌంట్స్‌కి వెళితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, టెండర్స్‌లో ఎలాంటి పక్రియ ఫాలో కావాలో అప్పటికే సింగరేణి నుంచి ప్రారంభించిన వాటిని అమల్లోకి తీసుకునేందుకు శిఖండి ప్రయత్నాలు మొదయ్యాయని తెలుస్తుంది.
ఇలా రోడ్ల నుంచి సీసీ కెమెరాలు, అడ్వర్టైజింగ్, అనుమతులు అనేక రకాలుగా అధికారులు దోపిడికి పాల్పడుతున్నారు. ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు ఇలా అందరూ పైసాయే పరమాత్మ అంటే ప్రజాస్వామ్యం ఎలా నడవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు స్వీయ నియంత్రణ తప్పనిసరి. రాజ్యంగంపై ప్రమాణం చేసిన వారే ఇలా వ్యవహరిస్తే వీళ్ల కంటే మావోయిస్టులు వెయ్యి అంతల కంటే ఎక్కువ మేలు.
వారు పేదల కోసం పని చేసేవారు. అన్ని సౌకర్యాలు కల్పించినా పైసల కోసం నానా గడ్డి కరిచే అధికారులకు ఇప్పటికైనా కనువిప్పు కావాలి. లేదంటే బయటపడ్డప్పుడు మనశ్శాంతి లేకుండా అమోయ్ కుమార్‌లా, మరో అరవింద్ కుమార్‌లా బతికినా చచ్చిబతకాల్సి వస్తుంది.


