Ponnam Prabhakar: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నవంబర్ 14న గిగ్ వర్కర్స్ తో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టే ర్యాలీలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్స్ పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. గత పదేళ్లుగా పెరగని ఆటో ఛార్జీలను పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పెంచిందన్నారు.
ఆటో డ్రైవర్ల చిరకాల డిమాండ్ అయిన వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటుకు అంగీకారం తెలిపి చట్టబద్ధంగా చర్యలు ప్రారంభించామన్నారు. క్యాబ్, ట్యాక్సీ, ర్యాపిడో తదితర అగ్రిగేటర్ రంగాల్లో పనిచేసే వారి సంక్షేమానికి కూడా ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఫహీం ఖురేషిలతో కలిసి మీడియాతో మాట్లాడారు పొన్నం ప్రభాకర్.
రుణ పరిమితి 10 లక్షలకు పెంపు
మహిళా సంఘాలకు గతంలో ఉన్న 5 లక్షల రూపాయల రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమై కుటుంబాలను పోషించుకునేలా ప్రజాపాలన ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకొని.. రెండున్నర లక్షల మంది లబ్ధిదారులు కొత్త ఇళ్లలో దీపావళి పండుగను జరుపుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
100కోట్ల విలువైన ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు
హైదరాబాద్ నగరంలో పేదలు, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందన్నారు. ఎకరం రూ.100 కోట్ల విలువైన ఖరీదైన ప్రాంతాల్లోనూ పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. ఆర్టీసీ, పోలీస్ శాఖలకు చెందిన స్థలాల్లోనూ పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ప్రజలు పని చేసే ప్రాంతాలకు సమీపంలోనే నివాసం ఉండేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఢిల్లీలా హైదరాబాద్ మారకుండా చర్యలు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రవాణ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరం ఢిల్లీ తరహా కాలుష్య నగరంగా మారకుండా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రూ.200 కోట్లతో పాత ఆటోలను ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే రెట్రోఫిట్ కార్యక్రమం తీసుకున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


