నేడు తెలంగాణ భాషా దినోత్సవం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరు పడిన తర్వాత 2014లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 9వ తేదీన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని 'తెలంగాణ భాషా దినోత్సవం'ను ప్రకటించింది. దీంతో ప్రతి ఏటా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నది.
సెప్టెంబర్ 9న ఎందుకు?
తెలంగాణ మాటకు, మట్టికి, సంస్కృతికి ప్రత్యేకమైన రోజు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రజల నిత్య జీవితంలో వినిపించే తెలంగాణ యాసను, మాటల మాధుర్యాన్ని, సాహిత్య వైభవాన్ని గుర్తుచేసుకునే సందర్భమిది.
తెలంగాణ అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు.. ప్రత్యేకమైన భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం. బతుకమ్మ, బోనాలు, ఒగ్గుకథ, బుర్రకథ, జానపద గేయాలు తెలంగాణ జీవనశైలికి ప్రతిబింబాలు. చార్మినార్ నుంచి రామప్ప వరకు, గోల్కొండ నుంచి వేయిస్తంభాల గుడి వరకు తెలంగాణ చరిత్ర, కళా వైభవం అడుగడుగునా కనిపిస్తుంది.
కాళోజీ తన కలంతో సామాన్యుడి గొంతుకగా నిలిచారు. తెలంగాణ మాటను గౌరవంగా నిలబెట్టారు. అందుకే ఆయన జయంతి రోజున భాషా దినోత్సవం జరుపుకోవడం తెలంగాణ భాషకు, యాసకు, ఆత్మగౌరవానికి ఇచ్చే గౌరవానికి ప్రతీకగా నాటి ప్రభుత్వం భావించి.. మహాకవి కాళోజి జయంతి నాడే తెలంగాణ భాషా దినోత్సవాన్ని డిక్లేర్ చేసింది.
కాళోజీ తన రచనల ద్వారా ప్రజల భాష, తెలంగాణ యాస, సామాన్యుడి జీవితం, సామాజిక సమస్యలు వంటి అంశాలను బలంగా వ్యక్తీకరించారు. అందుకే తెలంగాణ మాండలికానికి, సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టినరోజునే భాషా దినోత్సవంగా ఎంచుకున్నట్టు తెలిసింది.
ఆరోజు ఏం చేస్తారు?
పాఠశాలలు, కళాశాలలు, సాంస్కృతిక సంస్థల్లో తెలంగాణ భాష, యాసపై చర్చలు, వ్యాసరచన, ఉపన్యాసం, కవితా పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణ సాహిత్యానికి సేవ చేసిన వారిని కాళోజీ స్మారక పురస్కారంతో సత్కరిస్తారు.
ప్రాంతాలుగా విడిపోయిన భారతీయులంతా ఒక్కటే..
ఉమ్మడి ఏపీలో తెలంగాణకు తీవ్ర వివక్షకు గురైంది. భాష పరంగా, రాష్ట్రానికి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో నాటి ఉమ్మడి పాలకులు తెలంగాణను పట్టించుకోలేదు. ఆరవై ఏండ్లు గోసపడిన తెలంగాణ.. 2009లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్రం కోసం గళం వినిపించింది. 2014 వరకు రాష్ట్ర ప్రజల సుదీర్ఘపోరాటం, ఎన్నో బలిదానాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. ఆ తర్వాత ఏర్పాటైన తొలి తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి నాడే తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రకటించి ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు, తెలంగాణ ప్రత్యేక గొంతుకగా నిలిచిన ఆయన రచనలను గౌరవించుకుంది. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా భారతీయులుగా కలిసిమెలిసి ఉన్నారు.కాగా, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పాఠకులు, వీక్షకులకు ‘స్వేచ్ఛ న్యూస్’ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు..












