రాష్ట్రంలో వేసవి రాకముందే నీటి ఎద్దడి మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో నీటి కొరతతో గ్రామాల్లోని ప్రజలు అల్లాడుతున్నట్టు సమాచారం. మరోవైపు పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లోనే కాదు గ్రామాలు, పల్లెల్లో కూడా నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.దీనంతటికి ఎల్ నినో ప్రభావమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.
ఇదిలాఉండగా, హైదరాబాద్‌లో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. సమ్మర్ ఎఫెక్ట్ ఇప్పుడే తెలుస్తోంది. శీతాకాలంలో వేసవి మాదిరిగా ఎండలు దంచికొడుతుండటంతో జలాశయాల్లో నీరు అడుగంటుతోంది. తాజాగా రిపోర్టుల ప్రకారం హైదరాబాద్‌లోని ప్రాజెక్టుల్లో డిసెంబర్ వరకే నీరు ఉందని తెలుస్తోంది.
సింగూరు, మంజీరా రిజర్వాయర్ల ప్రస్తుత నీటిమట్టం ప్రకారం కేవలం 42 రోజులకు మాత్రమే సరిపడా నీళ్లు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. సింగూరు, మంజీరా జలాశయాల్లోని నీరు మరికొద్దిరోజుల్లో పూర్తిగా తగ్గిపోతుందని ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి నీటి కొరత తప్పదని అధికారులు చెబుతున్నారు.ముఖ్యంగా పటాన్‌చెరు, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, సనత్‌నగర్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు నీటి సరఫరా కష్టమేనని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లో నీటి కొరత వలన శేరిలింగంపల్లి నియోజకవర్గంపై తీవ్ర నీటి కొరత ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. సింగూరు, మంజీరా నుంచి నీళ్లు సరఫరా అయ్యే ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించే ప్రత్యామ్నాయ చర్యలపై ప్రస్తుతం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
అయితే, ఆరు నెలల క్రితం గోదావరి నీళ్లను కిందకు వదలకుండా ఉండి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది నీటిపారుదల రంగ నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయంలో గోదావరి జలాలను హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు తరలించి ఉంటే వేసవిలో నగరవాసులకు కష్టాలు తప్పేవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


