Yogi Adityanath: జెవార్ ఎయిర్పోర్టుకు మోడీ పేరు.. సీఎం యోగి సంచలన ప్రకటన!
Yogi Adityanath: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నోయిడా జెవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న ఈ ఎయిర్పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు పెట్టాలని డిసైడ్ అయ్యింది. లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఆమోదించారు.ప్రజాసేవలో గుజరాత్ సీఎం, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని, ప్రధాని గౌరవార్థం జెవార్ ఎయిర్పోర్టుకు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం యోగి వెల్లడించారు. ఈ సందర్భంగా మోడీకి అభినందనలు తెలిపిన ఆయన.. ప్రధాని లీడర్షిప్లో ఇండియా వరల్డ్ లెవెల్లో సరికొత్త ఎత్తులకు చేరిందని ప్రశంసించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూనే, దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
