Xi Jinping : ‘‘బలవంతుడిదే రాజ్యం అంటే కుదరదు..’’ బ్రిక్స్ వేదికగా అమెరికాకు జిన్‌పింగ్ వార్నింగ్!
Xi Jinping : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో పెత్తనం చెలాయిస్తున్న అగ్రరాజ్యాల ధోరణిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బ్రిక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలో ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అంతర్జాతీయ క్రమాన్ని ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థతో పోల్చుతూ.. నియమ నిబంధనలు లేని ప్రపంచం సిగ్నల్స్ లేని నాలుగు రోడ్ల కూడలి లాంటిదని, అటువంటి చోట భారీ ప్రమాదాలు, తీవ్ర గందరగోళం తప్పవని హెచ్చరించారు.పాశ్చాత్య దేశాలు, ప్రత్యేకించి అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష ఆధిపత్య పోకడలను జిన్‌పింగ్ పరోక్షంగా ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆధునిక ప్రపంచంలో ‘బలవంతుడిదే రాజ్యం’ అనే ఆటవిక భావన ఇక ఎంతమాత్రం చెల్లదని కుండబద్దలు కొట్టారు. ఒక దేశం ఎంత పెద్దది? ఎంత సంపన్నమైనది? ఎంత సైనిక బలం ఉంది? అనే అంశాలతో సంబంధం లేకుండా.. అంతర్జాతీయ వేదికపై ప్రతి దేశానికీ సమానమైన హక్కు, సమానమైన వాటా ఉండాలని స్పష్టం చేశారు.
