తెలంగాణ
కొడంగల్ ప్రజల ఇళ్లనే కూల్చేస్తావా రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దలను వదిలేసి పేదల ఇళ్లు, భూముల మీద సీఎం రేవంత్ రెడ్డి పడుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. కొడంగల్లో ఇండ్లు కోల్పోయిన బాధితుల పక్షాన హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొడంగల్ బిడ్డను అంటూ కొడంగల్ ప్రజల ఇళ్లనే కూల్చేస్తావా రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. మద్దూరులో రాత్రికి రాత్రే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను నడిపించే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? అంటూ మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అని అడిగారు. ‘న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించరా?ఒక్కసారిగా ఇండ్లు కూల్చితే, ఏండ్ల నుండి నివాసం ఉన్నవారు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్తారు’ అని నిలదీశారు.
